దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అశ్విన్ (46: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు) కూడా రాణించాడు. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై 10 వికెట్లూ ఫాస్ట్ బౌలర్లకే దక్కాయి. మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. డుయాన్ ఒలివియర్, కగిసో రబడలకు చెరో మూడు వికెట్లు దక్కాయి.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ 14 ఓవర్ల పాటు సజావుగానే సాగింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మయాంక్ అగర్వాల్‌ను (26: 37 బంతుల్లో ఐదు ఫోర్లు) అవుట్ చేసి మార్కో జాన్సెన్ దక్షిణాఫ్రికాకు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 24వ ఓవర్లలో చతేశ్వర్‌ పుజారా (3: 33 బంతుల్లో), అజింక్య రహానేలను (0: 1 బంతి) అవుట్ చేసి ఒలివియర్ భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. దీంతో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగుల స్కోరుతో భారత్ మొదటి సెషన్ ముగించింది.


లంచ్ విరామం తర్వాత హనుమ విహారి (20: 53 బంతుల్లో, మూడు ఫోర్లు), కేఎల్ రాహుల్ కాసేపు వికెట్లు పడకుండా నిలువరించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అయితే ఇదే సెషన్‌లో విహారి, రాహుల్ ఇద్దరూ అవుటయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో వీరిద్దరినీ బోల్తా కొట్టించారు. టీ విరామం సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.


ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసిపోవడానికి ఎంతో సేపు పట్టలేదు. ఒకవైపు అశ్విన్ క్రీజులో ఉన్నా... అవతలి ఎండ్‌లో వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. తన స్వభావానికి విరుద్ధంగా నిదానంగా ఆడిన పంత్ (17: 43 బంతుల్లో, ఒక్క ఫోర్) కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. దూకుడుగా ఆడిన అశ్విన్.. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు వెళ్లి తొమ్మిదో వికెట్‌గా అవుటయ్యాడు. ఆ తర్వాత బుమ్రా (14: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా.. సిరాజ్ (1: 6 బంతుల్లో) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.