దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో, 10 ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసికి రెండు వికెట్లు దక్కగా.. మగల, మార్క్రమ్, కేశవ్ మహరాజ్, ఫెలుక్వాయో తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా విజయానికి 288 పరుగులు చేయాల్సి ఉంది.


భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి 11 ఓవర్ల పాటు ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. కేఎల్ రాహుల్‌తో (55: 79 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మొదటి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం శిఖర్ ధావన్ (29: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు) మార్క్రమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (0: 5 బంతుల్లో) కూడా తర్వాతి ఓవర్లోనే అవుట్ కావడంతో భారత్ 64 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఈ దశలో రాహుల్‌కు రిషబ్ పంత్ జతకలిశాడు. రాహుల్ ఒక ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేయగా.. రిషబ్ పంత్ మాత్రం చెలరేగి ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 111 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుటపడింది అనుకున్న సమయంలో మళ్లీ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు.


ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (11: 14 బంతుల్లో) విఫలం కాగా.. వెంకటేష్ అయ్యర్ (22: 33 బంతుల్లో, ఒక సిక్సర్) కాసేపు క్రీజులో నిలబడే ప్రయత్నం చేశాడు. అయితే ఫెలుక్వాయో వైడ్ బాల్‌తో వెంకటేష్ అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. వైడ్ బాల్‌కు వెంకటేష్ అయ్యర్ స్టంప్డ్ అవుట్ అయి వెనుదిరిగాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (40: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), అశ్విన్ (25: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఆదుకోవడంతో భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు సాధించింది.


Also Read: IND vs SA 2nd ODI: టీమ్‌ఇండియాలో మార్పులకు రాహుల్‌ సై..! లేదంటే ఓటమి బాటే!!


Also Read: IND vs WI Reschedule: విండీస్‌ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్‌, కోల్‌కతాల్లోనే మ్యాచులు!


Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!