Shubman Gill T20I Century IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో గిల్ అజేయంగా 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 200గా ఉంది. ఇది టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 2023లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఏకంగా 208 పరుగులు చేశాడు.
భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ టీ20లో సెంచరీ చేయడం ద్వారా శుభ్‌మన్ గిల్ ప్రత్యేక క్లబ్‌లోకి ప్రవేశించాడు. శుభ్‌మన్ గిల్ టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి సురేష్ రైనా. ఆ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా చేరిపోయాడు.
శుభ్‌మన్ గిల్ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటివరకు ఎలా సాగింది?
శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు భారత జట్టు తరఫున మొత్తం 13 టెస్టులు, 21 వన్డేలు, ఆరు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 25 ఇన్నింగ్స్‌ల్లో 32 సగటుతో 736 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఇది కాకుండా శుభ్‌మన్ గిల్ 21 వన్డే ఇన్నింగ్స్‌లలో 73.76 సగటుతో 1,254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో అతను ఆరు టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో 40.40 సగటుతో, 165.57 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది.
ఇక న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తన పేలవ ఫాం ను కొనసాగిస్తూ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి, శుభ్ మన్ గిల్ లు చెలరేగి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఉన్నంతసేపు అదరగొట్టిన త్రిపాఠి 22 బంతుల్లో 44 పరుగులు చేసి ఇష్ సోధి బౌలింగ్ లో ఔటయ్యాడు. వచ్చీ రావడంతోనే 2 సిక్సులు కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24)ను టిక్నర్ వెనక్కు పంపాడు.
విధ్వంసకర సూర్య ఔటవటంతో స్కోరు నెమ్మదిస్తుందనుకుంటే అనూహ్యంగా గిల్ (63 బంతుల్లో 126) చెలరేగిపోయాడు. వన్డేల్లో డబుల్ సెంచరీతో అదరగొట్టినా.. తొలి 2 టీ20ల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ ఓపెనర్ అసలైన మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. కళాత్మక షాట్లతో ఆకట్టుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన భారత ఐదో బ్యాటర్ గా నిలిచాడు. గిల్ కు తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్య (30) కూడా భారీ షాట్లు కొట్టటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు సాధించింది.