IND vs NZ 1st T20I: రాంచీలో శుక్రవారం (జనవరి 28వ తేదీ) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆ టార్గెట్ ఛేదనకు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీ20 మ్యాచ్‌లో భారత గడ్డపై టీమిండియాపై కివీస్ జట్టు 200 కంటే తక్కువ స్కోరును కాపాడుకోవడం ఇది నాలుగోసారి. న్యూజిలాండ్‌ మినహా మరే ఇతర జట్టూ భారత్‌లో ఒక్కసారి కూడా ఈ ఘనత సాధించలేకపోయింది.


చెన్నై 2012: 2012వ సంవత్సరం సెప్టెంబర్‌లో తొలిసారిగా న్యూజిలాండ్ భారత్‌పై 200 కంటే తక్కువ స్కోరును కాపాడుకుంది. చెపాక్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 167 పరుగులు చేసింది. అనంంతరం బరిలోకి దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేయగలిగింది.


నాగ్‌పూర్ 2016: 2016 మార్చిలో T20 ప్రపంచ కప్ సందర్భంగా, నాగ్‌పూర్‌లో జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో, న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. అయినప్పటికీ ఈ స్కోరును కివీస్ జట్టు కాపాడుకోగలిగింది. కివీస్ బౌలర్లు భారత జట్టును కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేశారు.


రాజ్‌కోట్ 2017: 2017 నవంబర్లో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక్కడ కివీస్ జట్టు 40 పరుగుల తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.


రాంచీ 2023: రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియాపై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. దీంతో సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (21) 68 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు.


అయితే వీరిద్దరూ కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే అవుటయ్యారు. అనంతరం వాషింగ్టన్ సుందర్ పోరాడినా తనకు మరో ఎండ్‌లో మద్దతు లభించలేదు. దీంతో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది.


అంతకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తర్వాత చాలా మంది బ్యాట్స్‌మెన్ ఎక్కువగా రాణించలేక పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చివర్లో డేరిల్ మిచెల్ 30 బంతుల్లో అజేయమైన 59 పరుగుల ఇన్నింగ్స్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.