IND vs NZ 3rd ODI: ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను స్వదేశంలో ఆడుతోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్‌ రాయ్‌పూర్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెన్ ఇన్ బ్లూ జట్టు 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది.


ఇప్పుడు వీరిద్దరి మధ్య ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మూడో మ్యాచ్‌లో భారత జట్టు 3-0 తేడాతో విజిటింగ్‌ జట్టును క్లీన్‌స్వీప్‌ చేయాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగనుంది. ఈ ఇంపార్టెంట్ వన్డే హోల్కర్ స్టేడియంలో జరగనుంది. మూడో వన్డే మ్యాచ్‌కు హోల్కర్ పిచ్ ఎలా ఉంటుందో, వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఇక్కడ ఉన్న చిన్న బౌండరీ బ్యాట్స్‌మెన్‌కు చాలా సహాయపడుతుంది. ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా మద్దతు లభించనుంది. అయితే పరుగులు కాపాడుకోవడానికి బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఆడిన మొత్తం ఐదు వన్డేల్లో ఛేజింగ్ చేసిన జట్టు 3 సార్లు గెలుపొందగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలుపొందింది. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచి బౌలింగ్ చేయడం మంచిదని అనిపిస్తోంది.


వర్షం కలవరపెడుతుందా?
ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ రోజు ఇక్కడ వాతావరణం మరింత వేడిగా ఉండనుంది. జనవరి 24వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల వరకు ఉంటుంది. అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో ఏ విధంగానూ వర్షం కురిసే అవకాశం లేదు.


మన రికార్డు అద్భుతం
హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు మొత్తం ఐదు వన్డేలు ఆడింది. ఇందులో జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. ఇందులో జట్టు మూడు సార్లు లక్ష్యాన్ని ఛేదించింది. అదే సమయంలో, రెండుసార్లు మొదట బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు చేయడం విశేషం.


ఇండోర్‌‌లో చివరిసారిగా జరిగిన టీ20లో మాత్రం భారత్ ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ టీ20లో భారత్ 228 పరుగులను ఛేదించలేక చతికిలపడింది. లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాను దక్షిణాఫ్రికా 178కి పరిమితం చేసింది. 49 రన్స్‌ తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపు బావుటా ఎగరేసింది. ఛేదనలో దీపక్‌ చాహర్‌ (31; 17 బంతుల్లో 2x4, 3x6) దినేశ్‌ కార్తీక్‌ (26; 21 బంతుల్లో 4x4, 4x6) రాణించారు. మిగతా వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. అంతకు ముందు దక్షిణాఫ్రికాలో రిలీ రొసో (100*; 48 బంతుల్లో 7x4, 8x6) సెంచరీ, క్వింటన్‌ డికాక్‌ (68; 43 బంతుల్లో 6x4, 4x6) హాఫ్‌ సెంచరీతో అలరించారు.