Warangal News: పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. వెంటనే భూ ఆక్రమణ దారుడు జక్కుల రవీందర్ పై కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో.. తమ భూములు, స్థలాలను భూ అక్రమణదారుల నుండి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
200 గజాల భూమి కబ్జా - డెవలప్ మెంట్ పేరుతో హై డ్రామా
హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ డెవలప్మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్ ఓనర్ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్మీదికి వెళ్లి కాంపౌండ్‌వాల్‌ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు ఐదు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ఆదేశాలతో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌తో పాటు అతడి డ్రైవర్ పడాల కుమార స్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్ జేఎఫ్‌సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్ ను తరలించారు.
మరో ఘటనలో అరెస్ట్..
దేశాయిపేటలోని సర్వేనంబర్ 90/బిలో భూమిని అక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన పొక్కులు చిరంజీవిరావు, గొడాసి అశ్విన్ కుమార్, సురోజు రమేష్ లను ఇంతేజార్గంబీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు బొమ్మకంటి శ్రీనివాస్, మునుగంటి రమేష్ లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో నిందితులు తప్పుడు పత్రాలను సృష్టించడంతో పాటు ప్రభుత్వ సూచించిన ధరల పట్టేక కన్న అతి తక్కువ ధరకు భూమిని ఎలాంటి లావాదేవీలు జరగకున్న క్రయ విక్రయాలు జరిగినట్లుగా లేని భూమికి సంబంధించి ప్రతాలను సృష్టించారు ఈ నిందితులు.
దేశాయిపేటలోని సర్వే నంబర్ 90/బి భూమి తాము కొనుగోలు చేసినట్లుగా నిందితులు అసలు భూ యజమానులను బెదిరించి భూమిని ఆక్రమించడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా క్షేత్ర స్థాయితో పాటు భూమి సంబంధించి పత్రాలను పరిశీలించిన పోలీసులు నిందితులు భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.