టీమిండియాతో నాలుగో టెస్ట్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు చేసింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ కారణంగా సిరీస్‌లో మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు.అలాగే ఫాస్ట్‌ బౌలర్‌ సకీబ్‌ మహమూద్‌పై వేటు పడింది.  బట్లర్‌ స్థానాన్ని సామ్‌ బిల్లింగ్స్‌తో భర్తీ చేయగా, సకీబ్‌ ప్లేస్‌లో క్రిస్‌ వోక్స్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర

ఇంగ్లండ్‌ జట్టులో మార్పులపై కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ... నాలుగో టెస్ట్‌లో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను జానీ బెయిర్‌స్టో నిర్వహిస్తాడని వెల్లడించాడు. దీంతో మరో బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందన్నాడు. కీపింగ్‌ బాధ్యతలకు బెయిర్‌స్టో ఓకే చెబితే.. ఓలీ పోప్‌ లేదా డానియల్‌ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం లభిస్తుంది. 

Also Read: Sumit Antil wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం... జావెలిన్ త్రోలో సుమిత్ అంటి‌ల్‌కి బంగారు పతకం

నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మూడో టెస్టులో ఇంగ్లాండ్ అనూహ్యంగా పుంజుకుని భారీ విజయం నమోదు చేసుకుంది. దీంతో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి. మరి నాలుగో టెస్టులో ఎవరు విజయం సాధించి ఆధిక్యాన్ని సాధిస్తారో చూడాలి.  

నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు:జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), రోరీ బర్న్స్, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలన్, ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.