టోక్యోలో జరుగుతోన్న పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖరాకు ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్‌ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రత్యేక SUVని ఇవ్వనున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. 






భారత పారా ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీప మలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్‌యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ  పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 


పారా ఒలింపిక్స్‌ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ  కురుస్తోంది. మరోవైపు  తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు.  ఈ అనుభూతిని వర్ణించ లేనిదని చెప్పింది. 






ఇదిలా ఉంటే... తన లాంటి ప్రత్యేక సామర‍్థ్యం ఉన్న వారి కోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీప మలిక్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో షేర్ చేశారు. టోక్యోలో ఓ ప్రత్యేక వాహనంలో ఆమె క్రీడా గ్రామానికి వెళ్లిన వీడియోను పంచుకుంది.






అందులో ప్రత్యేక సీటులో ఉన్న వాహనంలో ప్రయాణించింది. ఇలాంటి వాహనం తనకు కావాలని కోరుకుంది. తనకు SUV నడపడం అంటే ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్‌లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువస్తే, తాను తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని తెలిపింది. దీప మలిక్‌ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారి కోసం ప్రత్యేక ఎస్‌యూవీల తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును ట్విటర్ ద్వారా కోరారు.