వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ అనంతరం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ ఆడుతోంది. అయితే గత కొంతకాలం నుంచి వరుసగా విఫలం అవుతున్న చతేశ్వర్ పూజారా.. అజింక్య రహానే ఈ ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా విఫలమవుతున్నారు. దీనిపై లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుజారా, రహానే లో ప్రొఫైల్ ఆటగాళ్లు అని వ్యాఖ్యానించారు. అయితే వీరికి జట్టు సహచరుడు , రెండో టెస్టులో శతకవీరుడు కేఎల్ రాహుల్ మద్దతు తెలిపాడు.


గత అయిదు టెస్టుల్లో రహానే కేవలం ఒక్క అర్ధ శతకం మాత్రమే సాధించగా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ పుజారా కనీసం అర్థ శతకం సైతం చేయలేకపోయాడు. ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టులో 4, 12 పరుగులతో విఫలమైన పుజారా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే వికెట్ సమర్పించుకోగా.. అజింక్య రహానే సైతం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. తన సహచరులు పుజారా, రహానేలు త్వరలోనే మళ్లీ ఫామ్ అందిపుచ్చుకుంటారని కేఎల్ రాహుల్ (129) ధీమా వ్యక్తం చేశాడు. భారత జట్టు కోసం పుజారా, రహానే ఎంతో చేశారని.. క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందించారని కొనియాడాడు.
Also Read: IND vs ENG, 1st Innings Highlights: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్


‘పుజారా, రహానే వరల్డ్ క్లాస్ క్రికెటర్లు. వీరికి అపారమైన అనుభవం ఉంది. మళ్లీ ఫామ్‌లోకి రావడం ఎలాగో వారికి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఇంగ్లాండ్ గడ్డపై ఆటడం సవాళ్లతో కూడుకుని ఉంటుంది. కొన్ని బంతులను సరిగ్గా ఆడితే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ ఆటగాడైనా ప్రతి ఇన్నింగ్స్‌లో పరుగులు సాధించలేడు. కొన్ని సందర్భాలలో ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని’ మీడియా సమావేశంలో కేఎల్ రాహుల్ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. 


గత కొన్ని టెస్టుల నుంచి పూర్తిగా వైఫల్యం చెందుతున్న పుజారా, రహానేలు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు జట్టుకు భారంగా మారారని,  వీరిని జట్టు నుంచి తప్పించి కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించాలని మాజీలు సైతం సూచిస్తున్నారు. సునీల్ గవాస్కర్ మరో అడుగు ముందుకేసి.. రహానే, పుజారాలను లో ప్రొఫైల్ క్రికెటర్లు అని, టెక్నిక్ లోపాలు సరిదిద్దుకోవడం లేదని విమర్శించారు. వీరిద్దరిని జట్టు నుంచి తీసేసినా ఏ సమస్యా లేదని, రహానే, పుజారా కోసం చొక్కాలు చింపుకునే అభిమానులు లేరంటూ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జట్టు సహచరుడు, ఓపెనర్ రాహుల్ ఆ ఇద్దరికీ మద్దతుగా నిలిచాడు.
Also Read: Unmukt Chand Retirement: టీమిండియా తరఫున ఆడకుండానే... రిటైర్మెంట్ ప్రకటించిన 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్