టీమిండియా తరఫున ఆడాలని ఏ క్రికెటర్ అయినా అనుకుంటాడు. కానీ, భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్‌కి ఏమైందో తెలియదుగాని ఆ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించాడు. 


వివరాల్లోకి వెళితే... భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌ శుక్రవారం భారత్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. విదేశీ లీగుల్లో ఆడేందుకే తాను భారత్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఉన్ముక్త్‌ చంద్‌ ట్విటర్ ద్వారా స్పష్టం చేశాడు. ఇదే విషయమై ఉన్ముక్త్‌ ట్విటర్‌ వేదికగా BCCIకి తెలిపాడు. 2012లో అండర్‌ - 19 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియాకు సారథ్య బాధ్యతలు వహించాడు ఉన్ముక్త్. ఆ మ్యాచ్‌లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు కప్ అందించడంలో కీలకపాత్ర పోషించడంలో అప్పట్లో వార్తల్లో నిలిచి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.







ఆ తర్వాత ఇండియా- ఏకు కెప్టెన్‌గా ఉన్ముక్త్ ఎంపికయ్యాడు. 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఆ సమయంలో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్‌లో అతడు చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి ఇండియా జట్టులో ఆడే అవకాశం రాలేదు. 


తన రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్‌ చంద్‌ స్పందిస్తూ..'' భారత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం కాస్త బాధ కలిగించింది. తాజా రిటైర్మెంట్‌తో భారత్‌ క్రికెట్‌కు ఇక ప్రాతినిథ్యం వహించలేననే విషయంతో.... ఒక నిమిషం నా గుండెను ఆపేసినట్లైంది. విదేశీ లీగుల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంత కాలం నాకు అండగా నిలిచిన భారత క్రికెట్‌ ప్రేమికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా'' అని తెలిపాడు. 


స్వతహాగా మంచి టెక్నిక్‌తో షాట్లు ఆడే ఉన్ముక్త్‌  ఆ తర్వాత ఎందుకో మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఉన్ముక్త్‌ చంద్‌ 65 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు, 120 లిస్ట్‌ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు, ఇక టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌‌ల్లో 1565 పరుగులు చేశాడు. 2011 నుంచి IPL ఆడుతున్న ఉన్ముక్త్ చంద్... దిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 21 మ్యాచ్‌లాడి 300 పరుగులు చేశాడు.