IND vs ENG 2nd ODI: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma) మీడియా సమావేశాల్లో సరదాగా ఉంటాడు. కఠినమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే నవ్వుతూ బదులిస్తాడు. అవసరమైతే తనే కొన్ని ఛలోక్తులూ విసురుతాడు. అలాంటిది ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు చిరాకు పడ్డాడు. ఇంకెన్ని సార్లు ఇలాంటి ప్రశ్నలు సంధిస్తారని అసహనం చెందాడు. విరాట్‌ కోహ్లీ ఫామ్‌ గురించి అడగడమే ఇందుకు కారణం.


విరాట్‌ కోహ్లీకి రోహిత్‌ శర్మ అండగా నిలిచాడు. అతడు తిరిగి ఫామ్‌ అందుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. మళ్లీ మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడగొద్దని పరోక్షంగా సూచించాడు. 'మళ్లీ మళ్లీ ఈ చర్చే ఎందుకు పెడుతున్నారు? నాకైతే అర్థమవ్వడం లేదు బ్రదర్‌' అని హిట్‌మ్యాన్‌ అన్నాడు.


'క్రికెట్లో విరాట్‌ కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఒకసారి అతడి సగటు పరిశీలించండి. ఎన్ని సెంచరీలు కొట్టాడో చూడండి. పరుగులు చేయడంలో అతడికెంతో అనుభవం ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఒడుదొడుకులు తప్పవు. వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటివి ఎదురవుతాయి. అతడెన్నో మ్యాచులు ఆడాడు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. ఎంతో గొప్ప బ్యాటర్‌. అతడికి ఎవరి మద్దతూ అవసరం లేదు' అని రోహిత్‌ పేర్కొన్నాడు.


Also Read: అతడికి 56, ఆమెకు 46 - తాళి కట్టలేదు కానీ డేటింగ్‌లో లలిత్ మోడీ, సుష్మితా సేన్ జోడీ 


Also Read: 16కే ఔటౌన విరాట్‌ కోహ్లీపై బాబర్‌ ఆజామ్‌ సంచలన ట్వీట్‌!


'చివరి మీడియా సమావేశంలోనూ నేనిదే చెప్పాను. ఫామ్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్రికెటర్‌ జీవితంలో ఇవన్నీ సహజం. కొన్నేళ్లుగా వందల మ్యాచులాడి వేల కొద్దీ పరుగులు చేసిన ఆటగాడు ఫామ్‌ అందుకోవడానికి రెండు మంచి ఇన్నింగ్సులు చాలు. నేనైతే ఇలాగే అనుకుంటాను. క్రికెట్‌ గురించి తెలిసిన వాళ్లదీ ఇదే అభిప్రాయం' అని హిట్‌ మ్యాన్‌ చెప్పాడు.


ఫామ్‌ గురించి కోహ్లీతో మాట్లాడారా అన్న ప్రశ్నకు 'ఇలాంటివి మేం మాట్లాడుకుంటాం. అయితే అలాంటి సందర్భాల్లో అవతలి వారిని అర్థం చేసుకుంటాం. ఆటగాళ్ల ఫామ్‌లో ఒడుదొడుకులు ఉంటాయి. కానీ క్వాలిటీ మాత్రం ఎప్పటికీ తగ్గదు. విరాట్‌ ఏం చేయగలడో, ఇంతకు ముందేం చేశాడో మర్చిపోవద్దు' అని రోహిత్‌ బదులిచ్చాడు.