Babar Azam Message For Kohli: పాకిస్థాన్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజామ్‌ (Babar Azam) క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. సోదర భావాన్ని చూపించాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) అండగా నిలిచాడు. ఈ గడ్డు కాలం కచ్చితంగా పోతుందని ఊరట కల్పించాడు. కోహ్లీకి మద్దతుగా అతడు చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.


'ఇదీ గడిచిపోతుంది. ధైర్యంగా నిలబడాలి విరాట్‌ కోహ్లీ' అని పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ ట్వీట్‌ చేశాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచులో విరాట్‌ కోహ్లీ కేవలం 16 పరుగులే చేశాడు. అతడు పెవిలియన్‌కు చేరుకున్న వెంటనే ఆజామ్‌ ఇలా ట్వీట్‌ చేయడం గమనార్హం.


అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ! ఛేదనలో అతడు బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోయేవాళ్లు. అతడిని ఎలా ఔట్‌ చేయాలో అని సతమతం అయ్యేవాళ్లు. అతడికి బంతులేసేందుకు భయపడేవాళ్లు. అలాంటిది రెండున్నరేళ్లుగా విరాట్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అడపాదడపా హాఫ్‌ సెంచరీలు చేస్తున్నా, మిగతా క్రికెటర్లతో పోలిస్తే సగటు బాగున్నా. తన మునుపటి స్థాయి అందుకోవడం లేదు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేయక మూడేళ్లు అవుతోంది.


102 టెస్టులాడిన కోహ్లీ 50 సగటుతో 8074 పరుగులు చేశాడు. 261 వన్డేల్లో 57 సగటుతో 12327, 99 టీ20ల్లో 50 సగటుతో 3308 రన్స్‌ సాధించాడు. రెండు ఫార్మాట్లలో కలిసి 70 సెంచరీలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఏటా 2000 రన్స్‌ చేసే కింగ్‌ కోహ్లీ 2020లో 842, 2021లో 964, 2022లో 459 మాత్రమే సాధించాడు. అతడు త్వరగా ఫామ్‌ అందుకోవాలని అభిమానులు, టీమ్‌ఇండియా కోరుకుంటోంది. ఈ మధ్య గాయాల పాలవుతుండటంతో చాలా సిరీసుల్లో విశ్రాంతి ఇస్తున్నారు.