IND vs AUS: భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 9వ తేదీ నుండి నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా జట్టు భారత్ చేరుకోగా, భారత జట్టు ఆటగాళ్లు కూడా నాగ్‌పూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ నుండి శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
నిజానికి శ్రేయాస్ అయ్యర్ తన వెన్ను గాయం కారణంగా ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను పూర్తిగా ఫిట్‌గా అవ్వడానికి ఇంకా రెండు వారాలు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు అతని స్థానంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించవచ్చు.
ఇంతలో సూర్యకుమార్ యాదవ్ తన ఇన్‌స్టా స్టోరీలో అతను టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అరంగేట్రం చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విధ్వంసక బ్యాటింగ్ చేయడం ద్వారా తనదైన ముద్ర వేసిన సూర్యకుమార్ తన ఇన్‌స్టా స్టోరీలో రెడ్ బాల్ ఫొటోను షేర్ చేశాడు.
T20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక బ్యాటింగ్ గత సంవత్సరంలో చాలా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత చాలా మంది క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు అతనికి టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అవకాశం ఇవ్వాలని వాదించారు.
ఈ రంజీ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. అందులో అతను మూడు ఇన్నింగ్స్‌లలో 74.33 సగటుతో మొత్తం 233 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మొత్తంగా 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 44.75 సగటుతో 5549 పరుగులు చేశాడు. 14 సెంచరీలు కూడా ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన ఏడాదికే పొట్టి ఫార్మాట్లో నెంబర్ 1గా ఎదిగాడు. తనకు మాత్రమే సాధ్యమైన వినూత్న షాట్లతో విరుచుకుపడుతూ భారీగా పరుగులు సాధిస్తున్నాడు. క్రీజులో అతని విన్యాసాలు చూసి అభిమానులే కాదు.. ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. మైదానం నలుమూలలా షాట్లు కొడుతూ ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్ గా గుర్తింపుతెచ్చుకున్న సూర్య.. తాజాగా శ్రీలంకతో ముగిసిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో తన అరంగేట్రం, కెరీర్, తన షాట్లు, శిక్షణ, సన్నద్ధత గురించి పలు విషయాలు పంచుకున్నాడు సూర్యకుమార్య యాదవ్.
తన అంతర్జాతీయ అరంగేట్రం గురించి మాట్లాడిన సూర్య... ఆలస్యంగా జాతీయ జట్టులోకి రావడం వల్ల తనలో పరుగులు చేయాలనే ఆకలి పెరిగినట్లు చెప్పాడు. 'నా అంతర్జాతీయ అరంగేట్రం ఆలస్యం అయ్యింది. అందువల్లేనేమో నాలో ఆకలి బాగా పెరిగింది. ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు మంచే చేసింది. ఆట పట్ల నా ఉత్సాహమే నన్ను నడిపించింది.' అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తాను కొత్తగా ఇప్పుడు ఏ షాట్లూ ఆడడంలేదని.. కొన్నేళ్ల నుంచి ఆడుతున్నవే కొనసాగిస్తున్నానని సూర్యకుమార్ తెలిపాడు. టీ20 ఫార్మాట్లో అప్పుడప్పుడు బౌలర్ ను, బంతిని బట్టి షాట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. 'ఈ ఫార్మాట్లో కొన్ని షాట్లు ముందే అనుకుని ఆడతాం. అయితే మరికొన్నిసార్లు అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుని షాట్లు కొట్టాల్సిన అవసరముంది. మైదానాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని నేను షాట్లు కొడతాను.' అన్నాడు.