World Cup Final 2023: ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ(BCCI) అత్యంత ధనిక బోర్డు. ఆ స్థాయికి ఎదగడానికి ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC)ను శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. దాని వెనుక జవహర్ లాల్ నెహ్రూ (JawaharLal Nehru) చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన లేకపోయి ఉంటే బీసీసీఐకి ఐసీసీలో సభ్యత్వం ఉండేది కాదు. మొదటి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఐసీసీ నేడు బీసీసీఐ భాగంగా ఉండేలా చేసింది.  
 
1905 నుంచి 1907 వరకు జవహర్‌లాల్ నెహ్రూ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హారోస్ పాఠశాలకు వెళ్లారు. ఆ సమయంలో క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది. భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా క్రీడపై ప్రేమ కొనసాగింది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ, గణతంత్ర రాజ్యంగా మార్చే వరకు, అంటే రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు  బ్రిటీష్ చక్రవర్తిని రాజుగా అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీ భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారాలని, బ్రిటిష్ రాచరికంతో అన్ని సంబంధాలను తెంచుకోవాలని భావించింది. 


ఆ సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీ, ప్రతిపక్ష నాయకుడు విన్‌స్టన్ చర్చిల్ భారతదేశాన్ని కామన్వెల్త్‌లో భాగంగా ప్రతిపాదించారు. బ్రిటీష్ కామన్వెల్త్ అనేది 54 సభ్య దేశాల స్వచ్ఛంద సంఘం. వీటిలో ఎక్కువ భాగం బ్రిటిష్ వారు పాలించినవే ఉంటాయి. కామన్వెల్త్ అధిపతి బ్రిటిష్ చక్రవర్తి. కామన్వెల్త్ సభ్యులలో చాలామంది బ్రిటీష్ సామ్రాజ్యంతో చారిత్రక సంబంధాన్ని పంచుకునేవారు, కానీ రాజ్యాంగ సంబంధాన్ని మాత్రం కలిగి ఉండేవారు కాదు.


భారతదేశం కామన్వెల్త్‌లో భాగమనే ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ రాజరికంతో ఎలాంటి రాజకీయ, రాజ్యాంగపరమైన సంబంధాలను కొనసాగించకూడదని భావించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ, కామన్వెల్త్‌లో భారతదేశాన్ని కొనసాగించడానికి నెహ్రూ అంగీకరించారు.


ఈ నిర్ణయం భారత క్రికెట్‌ను ఎలా కాపాడింది?
బ్రిటిష్ ఇండియన్ జర్నలిస్ట్ మిహిర్ బోస్ రాసిన ‘నైన్ వేవ్స్: ది ఎక్ట్సార్డినరీ స్టోరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ పుస్తకంలో  ఇండియా ఏవిధంగా ఐసీసీలో సభ్యత్వం పొందిందో రాసుకొచ్చారు. 1948 జూలై 19న లార్డ్స్‌లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ఇప్పటి ICC) సమావేశమైనప్పుడు, భారతదేశం ICCలో సభ్యదేశంగా ఉండేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ సభ్యత్వం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ICC భారత్ సభ్యత్వంపై పునారాలోచిస్తుంది. 


అలాగే బ్రిటీష్ కామన్వెల్త్‌లో లేని దేశానికి సభ్యత్వం ముగుస్తుందని ICC రూల్ 5లో పేర్కొంది. 1950 జూన్‌లో ICC సమావేశమైనప్పుడు, భారతదేశం దాని రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. అలా బ్రిటిష్ రాచరికం ప్రభుత్వం ఇండియాపై ఎటువంటి అధికారాన్ని కలిగి ఉండకుండా కామన్వెల్త్‌లో కూడా సభ్య దేశంగా కొనసాగంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. దీంతో ICC భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చేసింది. అలా ఇండియా ICCని సైతం శాషించగలిగే స్థాయికి ఎదిగింది. ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో అత్యంత ధనవంతమైన బోర్డుగా ప్రసిద్ధికెక్కింది.


కెప్టెన్‌గా నెహ్రూ
సెప్టెంబర్ 1953లో, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్స్ XI, వైస్ ప్రెసిడెంట్స్ XI మధ్య రెండు రోజుల ఛారిటీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రైమ్‌ మినిస్టర్స్ ఎలెవన్‌కు కెప్టెన్‌గా ఉండటమే కాకుండా మ్యాచ్‌కు వ్యాఖ్యానం కూడా చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, 40 ఏళ్ల తర్వాత బ్యాట్ పట్టిన నెహ్రూ ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఆడినట్లు బీబీసీ నివేదిక పేర్కొంది. ఈ మ్యాచ్ ద్వారా సేకరించిన నిధులు బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వరద బాధితుల కోసం ఉపయోగించారు.