India Vs Australia: ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ను భారత్ గెలుచుకుని ఇప్పుడు ఫైనల్ లో అడుగుపెట్టడం ద్వారా 2019 వరల్డ్ కప్ లో భారత్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్‌లో ధోని చివర్లో రనౌట్ కావటంతో భారత్ కథ ముగిసిపోయింది. ధోని కూడా చాలా బాధపడ్డాడు. కాబట్టి ఆ ఓటమికి సమాధానమా అన్నట్లు మొన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచి ఓ రకంగా ధోని రుణం తీర్చుకుంది.


మరో రుణం బాకీ
అయితే ఇప్పుడు ఇంకో రుణం బాకీ ఉంది. అదే సౌరవ్ గంగూలీ. టీమిండియా ఇప్పుడు చాలా అగ్రెసివ్ మోడ్‌లో  ఆడుతుంది అంటే దానికి ప్రధాన కారణం సౌరవ్ గంగూలీ. ఫిక్సింగ్ ఆరోపణలు, మరకలతో భారత్ క్రికెట్ పాతాళానికి పడిపోతున్న టైమ్ లో తన అగ్రెసివ్ నెస్ తో టీమిండియా దశ దిశను మార్చేశాడు దాదా. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని ఇలా ఎందరో మెరికల్లాంటి ప్లేయర్లకు ఛాన్సులు ఇచ్చి వాళ్లకు అండగా నిలబడి ఈ రోజు మన టీమ్ ఈ స్థాయిలో నిలబడటానికి అతిపెద్ద కారణమయ్యాడు.


అలాంటి గంగూలీ కెరీర్ లో ఓ బాధ అంటే..2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవటమే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం టీమిండియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 125 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులతో చెలరేగిపోవటంతో ఆస్ట్రేలియా 359 పరుగులు చేస్తే... ఛేజింగ్ లో టీమిండియా 234 పరుగలకే ఆలౌట్ అయ్యింది.


ఈ ఓటమికి బదులిచ్చే అవకాశం ఇరవయ్యేళ్ల తర్వాత వచ్చింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో కంగారూలను చిత్తు చేయటం ద్వారా రెండు దశాబ్దాల నాటి ఓటమికి బదులిచ్చి గంగూలీ కి టీమిండియా సగర్వంగా ట్రిబ్యూట్ ఇవ్వాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు.