Shreyas Iyer ruled out 1st IND vs AUS test: భారత జట్టు ఆస్ట్రేలియాతో 2023లో మొదటి టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టు సన్నద్ధమవుతోంది. తొలి టెస్టు మ్యాచ్‌కు భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. వెన్ను గాయం కారణంగా అయ్యర్ తొలి మ్యాచ్‌ ఆడలేడు.


రెండో టెస్టు మ్యాచ్‌ నాటికి శ్రేయస్ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందనున్నాడని తెలుస్తోంది. అయితే గాయాల నుంచి కోలుకోవడం గురించి కచ్చితంగా అంచనా వేయలేం. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించిన దాని కంటే ప్రమాదకరం అయిన సంఘటనలు ఇంతకు ముందే చూశాం. అంతకుముందు అతను న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ స్క్వాడ్‌లో కూడా ఉన్నాడు. కాని తర్వాత రికవరీ కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపారు.


అయ్యర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడు
బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ “ముందుగా అనుకున్నట్లు శ్రేయస్ అయ్యర్ గాయం నయం కాలేదు. అతను మళ్లీ క్రికెట్ ఆడటానికి కనీసం రెండు వారాలు పడుతుంది. అతను మొదటి టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. రెండో టెస్ట్‌కు అతను అందుబాటులోకి వచ్చేది రానిది ఇంకా తెలియరాలేదు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు భారత్ తరఫున మొత్తం ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో కనిపించాడు.


కొన్ని నెలలుగా శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్లు విఫలమైన ప్రతిసారీ రాణిస్తున్నాడు. బంగ్లాదేశ్‌ పర్యటనలో అతడి బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. టెస్టులు, వన్డేల్లో విజృంభించాడు. తన షార్ట్‌పిచ్ బంతుల బలహీనత నుంచీ బయట పడుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎమర్జింగ్‌ ప్లేయర్‌గా అవతరించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో అతడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతడు గాయపడటం జట్టుకు ఎదురుదెబ్బే !


మరోవైపు రవీంద్ర జడేజా రూపంలో భారత్‌కు శుభవార్త కూడా అందింది. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇటీవల సౌరాష్ట్ర తరపున ఆడుతున్న రంజీ ట్రోఫీలో కనిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా భారత జట్టులో భాగం అవుతాడు. రంజీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 42 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. 2022 సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్‌కు రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు.


తొలి మ్యాచ్‌లో జట్టులో భాగమయ్యేందుకు రవీంద్ర జడేజా తన పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాల్సి ఉంటుంది. అతని ఫిట్‌నెస్ టెస్ట్ చివరి రౌండ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో జరుగుతుంది. రవీంద్ర జడేజా ఇప్పటివరకు భారత జట్టు తరపున మొత్తం 60 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 36.57 సగటుతో 2523 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 24.71 సగటుతో 242 వికెట్లు తీశాడు.