ICC World cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు మరో పరాభవం ఎదురైంది! ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో మిథాలీ సేన ఘోర ఓటమి చవిచూసింది. బే ఓవల్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లిష్ అమ్మాయిలు 31.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించారు. హెథర్ నైట్ (53*; 72 బంతుల్లో 8x4) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. నటాలీ షివర్ (45; 46 బంతుల్లో 8x4) ఆమెకు అండగా నిలిచింది. అంతకు ముందు ఇండియాలో స్మృతి మంధాన (35), రిచా ఘోష్ (33), జులన్ గోస్వామి (20) ఫర్వాలేదనిపించారు.
హెథర్ కెప్టెన్ ఇన్సింగ్స్
ఇచ్చింది తక్కువ టార్గెటే అయినా దానిని కాపాడుకొనేందుకు టీమ్‌ఇండియా ఎంతగానో శ్రమించింది! జట్టు స్కోరు 3 వద్ద డేనియెల్ వ్యాట్ (1)ను మేఘనా సింగ్ ఔట్ చేసింది. మరో పరుగుకే టామీ బ్యూమాంట్ (1)ను జులన్ గోస్వామి ఎల్బీగా పంపించింది. ఇదే జోష్‌లో మరిన్ని వికెట్లు తీయాలన్న టీమ్‌ఇండియా బౌలర్ల ఆశలను హెథర్ నైట్ భగ్నం చేసింది. తన అనుభవాన్ని ఉపయోగించి నటాలీ షివర్‌తో రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జట్టు స్కోరు 69 వద్ద షివర్‌ను ఔట్ చేయడం ద్వారా పూజా వస్త్రాకర్ ఈ జోడీని విడదీసినా లాభం లేకపోయింది. అమీ జోన్స్‌తో కలిసి 33, డంక్లీతో కలిసి 26 పరుగుల భాగస్వామ్యాలను నైట్ అందించింది. 102 వద్ద అమీ జోన్స్, 128 వద్ద సోఫియా డంక్లీ, కేథరిన్ బ్రంట్‌ను పెవిలియన్ పంపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లాండ్‌కు విజయం దక్కింది.
ఓపెనింగ్ నుంచి తడబ్యాటు..
గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు బరిలోకి దిగింది. మొదట టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. యస్తికా భాటికా, స్మృతి మంధాన భారత ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. కానీ 18 పరుగులకే ఓపెనర్ యస్తికా భాటికా (8)ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు శుభారంభం అందించింది బౌలర్ ష్రూబ్‌సోలే. ఆపై జట్టు స్కోరు 25 పరుగుల వద్ద కెప్టెన్ మిథాలీ రాజ్ ఔట్ కావడం భారత్ కు బిగ్ షాకిచ్చింది. 10 బంతులాడిన దీప్తి శర్మ ఖాతా తెరవకుండానే డకౌట్ అయింది. అది కూడా రనౌట్ రూపంలో దీప్తి శర్మ(0) పెవిలియన్ బాట పట్టింది.
ఒకే ఓవర్లో డబుల్ షాక్..
ఇంగ్లాండ్ బౌలర్ చార్లీ డీన్ టీమిండియావకు ఒకే ఒవర్లో డబుల్ షాకిచ్చింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(14), స్నేహ్ రానా(0)లను పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రెండో బంతికి హర్మన్ ఔట్ కాగా, తాను ఎదుర్కొన్న రెండో బంతికే (అదే ఓవర్లో నాలుగో బంతికి) స్నేహ్ రానా ఔటై డకౌట్‌గా వెనుదిరిగింది. టాపార్డర్‌లో యస్తికా భాటియా, మిథాలీరాజ్, దీప్తి రానాలు విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది.
ఆదుకున్న రిచా ఘోష్..
ఓవైపు వరుస వికెట్లు పడుతున్నా ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేసింది. కానీ 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంధానను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది ఇంగ్లాండ్ బౌలర్ ఎస్సెల్‌స్టోన్. మంధాన (35; 58 బంతుల్లో 4x4) ఔట్ కావడంతో భారత్ 100 పరుగులకే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ రిచా ఘోష్ భారత జట్టును ఆదుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. పూజా వస్త్రాకర్ 6 పరుగులకు ఔటయ్యాక.. సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామితో కలిసి రిచా ఘోష్ 8 వ వికెట్‌కు 37 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. స్కోరు పెంచే క్రమంలో అనవర పరుగుకు ప్రయత్నించి రిచా ఘోష్ (33; 56 బంతుల్లో 5x4) రనౌట్ అయి 8 వికెట్‌గా నిష్క్రమించింది. చివర్లో ఝులన్ గోస్వామి (20) పరవాలేదనిపించడంతో భారత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 36.2 ఓవర్లో భారత్ 134 పరుగులకే కుప్పకూలడంతో ఇంగ్లాండ్ ముందు లక్ష్యాన్ని ఉంచింది.