Ideas Of India Summit : ఏబీపీ న్యూస్ ఐడియాస్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. భారత మహిళా హాకీ క్రీడాకారిణి సుశీల చాను పాల్గొని మహిళా అథ్లెట్ల గురించి మాట్లాడారు.
ఇప్పటికీ మహిళా అథ్లెట్లకు పరిస్థితులు అనుకూలంగా లేవని సుశీల చాను అన్నారు. 'ఇంతకుముందు కంటే మహిళా అథ్లెట్ల పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇంకా కొన్ని మారాల్సి ఉంది.' అని చాను అభిప్రాయపడ్డారు.
ముఖ్యమైన విషయాలను పంచుకోవాలి
'ముఖ్యమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి సంకోచిస్తాం. కాని అలా చేయకూడదు. మహిళా అథ్లెట్లు అన్ని ముఖ్యనైన విషయాలను షేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్యలను అధిగమించవచ్చు. ఇంకా మా ఆట మెరుగుపడింది. ఇప్పుడు మేం దేనికీ భయపడకుండా ఆడుతున్నాం.' అని సుశీల చాను అన్నారు. భారత మహిళల హాకీ జట్టుకు సుశీల చాను కొన్నాళ్లు కెప్టెన్ గానూ వ్యవహరించారు. ఆమె మణిపూర్ కు చెందినవారు. 2016లో బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరిగిన ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత జట్టులో సభ్యురాలు.
ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్- 2023 పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో దేశంలోని ప్రముఖులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. నటులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు ఎంతో మంది ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా పాల్గొన్నారు.
28 ఏళ్ల వినేష్ ఫోగట్ హర్యానాలోని భివానీకి చెందిన మహిళ. మహిళల రెజ్లింగ్ లో ఆమె ఎన్నో విజయాలు, రికార్డులు సాధించారు. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం నెగ్గారు. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా రికార్డు సృష్టించారు. రెండు ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో 2 బంగారు పతకాలు సాధించారు. ఏబీపీ కార్యక్రమంలో వినేష్ పలు అంశాలపై మాట్లాడారు.
అందుకే నేను గళమెత్తాను
ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. దానిపై పోరాటం చేసిన వారిలో వినేష్ ఫోగట్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆమె మాట్లాడారు. 'మాకు రెజ్లింగ్ తప్ప మరేం తెలియదు. హర్యానాలో ఉన్న వాతావరణంలో ఏదో ఒక విధంగా మార్పు తీసుకురావాలనుకున్నాను. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా రెజ్లింగ్‌లో ముందుకు సాగాను. అయితే మిగిలిన అమ్మాయిల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. అందుకే ఆ సమస్యపై నేను గళమెత్తాను. ఈ తీవ్రమైన సమస్య గురించి అందరి ముందు లేవనెత్తాను.' అని వినేష్ చెప్పారు.