Bonda Uma in Tiruala: వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో దొరికిన దొంగలకు జైలు శిక్ష తప్పదని టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమా అన్నారు. శనివారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో బొండా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్ మొదలు పెట్టిన యువగళం పాదయాత్రకు వైసీపి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిస్తోందని అన్నారు. పాదయాత్రలో లోకేష్ ను మాట్లాడకుండా మైకులు, స్టూళ్లు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం, ఆటోలను సీజ్ చేయడం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా గొంతును నొక్కె ప్రయత్నం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన వికృతంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన, ఇంటికి వెళ్లిపోతున్నామని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేలు, సొంతంగా చేసుకున్న సర్వేలతో జగన్ కు భయం పట్టుకుందన్నారు.






ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పార్టి కార్యాలయాలపై దాడులు, కార్లు తగులబెట్టడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. అనపర్తిలో జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబును దాదాపు ఎనిమిది కిలో మీటర్ల పాటు లైట్లు తీసి నడిపించారన్నారు. పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత లోకేష్ పై ఇరవై కేసులు పెట్టారని, ఏం తప్పు చేసారని కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం ఉల్లంఘన చేస్తున్న అధికారులకు కనువిప్పు కలగాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు అధికారులు కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పు చేసిన ప్రతీ అధికారి సర్వీస్ రికార్డుల్లో శిక్షింపబడ్డారని చెప్పారు. పాదయాత్రకు అద్బుతంగా ప్రజల నుండి స్పందన వస్తుందని, లోకేష్ పాదయాత్రకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే లోకేష్ కు దుష్టశక్తుల నుండి రక్షణ కల్పించాలని, లక్ష్యం పూర్తి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు తెలియజేశారు.


అతి త్వరలోనే ఈ దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పలుకబోతున్నారని, అవినాష్ రెడ్డి దొరికి పోయిన దొంగ అని, అవినాష్ రెడ్డి వెనుక ఇంకా అసలైన శక్తులు ఉన్నాయని, అందులో అవినాష్ రెడ్డి తండ్రి కూడా కేసులో ఉన్నారని, మరికొందరు త్వరలోనే బయట పడతారన్నారు. ఇక గూగుల్ పే కోర్టు వాస్తవాలను బయట పెట్టిందని, కొన్ని రకాలుగా వివేకానంద రెడ్డి హత్య చేసి కొన్ని రోజులు మభ్య పెట్టగలిగారని, టెక్నాలజీ, సీబీఐ మొత్తం విషయాలు బయట‌ పెడుతుందన్నారు. దొరికిన దొంగకు జైలుకు వెళ్ళక తప్పదని ఆయన హెచ్చరించారు. వివేకానంద హత్య కేసులో ఆధారాలను తప్పు దోవ పట్టించింది అవినాష్ రెడ్డే అని, తెల్లవారుజామున మూడు గంటల నుండి భారతీ ఓఎస్డీ కృష్ణమోహన్, జగన్ తో మాట్లాడింది అవినాష్ రెడ్డే అని ఆయన తెలిపారు. వైఎస్ సునీత చేస్తున్న పోరాటం వీరి మెడకు చుట్టుకుందని, ఇంకా ఇద్దరూ వ్యక్తులను విచారణకు పిలుస్తారని, వివేకానంద హత్యలో నిందుతులు, పాత్రదారులు తప్పించుకోలేరని ఆయన తెలియజేశారు.