Alappuzha School Students: 


వీఆర్ కృష్ణ తేజ ఆలోచన...


పేద విద్యార్థులు పస్తులుండకూడదనే ఉద్దేశంతో, వారికి చేయూతనందించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలెప్పీ కలెక్టర్ వి. ఆర్ కృష్ణ తేజ. జిల్లాలో పేదరికమే కనిపించకుండా ఉండాలనే లక్ష్యంతో విద్యార్థులతోనే చేతనైన సాయం చేయిస్తున్నారు. కొద్ది వారాల క్రితమే ఈ కార్యక్రమం ప్రారంభించగా...అనూహ్య రీతిలో స్పందన లభిస్తోంది. "అలెప్పీ పిల్లలు" పేరుతో విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తున్నారు కలెక్టర్ కృష్ణ తేజ. ఒక్కో పాఠశాలలో 100 మంది విద్యార్థులను బృందంగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో బృందం ఒక్కో పేద కుటుంబాన్ని దత్తత తీసుకుంటుంది. నెలవారీ నిత్యావసరాలు అందజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. బియ్యం, డబ్బులు తప్ప మిగతా ఆహార పదార్థాలు దానం చేస్తారు. కచ్చితంగా ఇంతే దానం చేయాలన్న నియమం ఏమీ లేదు. వాళ్ల ఆర్థిక స్తోమత ఆధారంగా ఎంతైనా దానం చేయొచ్చు. ఈ కార్యక్రమం ప్రారంభించి నెలైనా గడవక ముందే 900కి పైగా పాఠశాలలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ప్రభుత్వ బడులతో పాటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, CBSE, ICSE స్కూల్స్‌లోని విద్యార్థులు కూడా భాగస్వాములవుతున్నారు. మొత్తం 3,613 పేద కుటుంబాలకు ఇప్పటి వరకూ సాయం అందింది. గతేడాది ఈ జిల్లాలో ఓ సర్వే చేపట్టిన ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించింది. ప్రభుత్వం గుర్తించిన ఆ కుటుంబాలకే సాయం అందిస్తున్నారు. 


కమ్యూనిటీ సర్వీస్ డే..


ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రతి నెల మొదటి సోమవారం రోజుని "కమ్యూనిటీ సర్వీస్ డే"గా పరిగణిస్తారు. ఫిబ్రవరి 6వ తేదీన ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆహార పదార్థాలతో పాటు సబ్బు, టూత్‌పేస్ట్ తీసుకొస్తారు విద్యార్థులు. వీటిని విభజించి కిట్‌ల వారీగా దత్తత తీసుకున్న పేద కుటుంబాలకు అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సాయం చేసే గుణం అలవాటవుతుందని అన్నారు కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ. ఈ కిట్‌ ద్వారా అందజేసే పదార్థాలు ఆ పేద కుటుంబాలకు నెల రోజుల వరకూ సరిపోతాయని చెప్పారు. 


"ఇదో స్వచ్ఛంద కార్యక్రమం. కానీ జిల్లాలోని దాదాపు అన్ని పాఠశాల్లలోని విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. దేశంలో పేదరికమే లేని జిల్లాగా అలెప్పీని మార్చాలన్నదే మా సంకల్పం. విద్యార్థులు ఆ కలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు" 


-వీఆర్ కృష్ణ తేజ, అలెప్పీ జిల్లా కలెక్టర్


ప్రత్యేకంగా కిట్‌లు పంపిణీ


మన్నంచెర్రిలోని ప్రభుత్వ హై స్కూల్‌లో 2,222మంది విద్యార్థులున్నారు. వీళ్లు 22 పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. కమ్యూనిటీ సర్వీస్ డే రోజున విద్యార్థులు తమకు తోచినవన్నీ పట్టుకొస్తారు. వీటితో స్కూల్ యాజమాన్యం 45 కిట్‌లు తయారు చేస్తుంది. వీటిలో కొన్ని కిట్‌లను పేద కుటుంబాలకు అందిస్తారు. మిగిలిన వాటిని స్థానికంగా ఉన్న పేద విద్యార్థులకు ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకునేందుకు ప్రతి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిని కో ఆర్డినేటర్‌గా నియమిస్తారు. 


Also Read: Ideas of India 2023: వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ విధానం సరికాదు, మూన్‌లైటింగ్‌ అనైతికం - ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి