Maharashtra Onion Farmer:


ఖర్చులు పోగా మిగిలింది ఇంతే..


ఉల్లిగడ్డల కొరతతో ప్రపంచమంతా సమస్యలు ఎదుర్కొంటోంది. ఉల్లి రైతులూ కష్టాలు తప్పడం లేదు. దళారులతో రైతులు ఎన్ని ఇబ్బందులు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతుల నుంచి తక్కువ ధరలకే ఉత్పత్తులు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు మార్కెట్‌లో విక్రయిస్తారు. సాగుదారులకు మాత్రం కనీస మద్దతు ధర కూడా దక్కదు. కొన్నిసార్లు దళారులు దారుణంగా మోసం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని ఓ రైతుకు ఎదురైంది. సోలాపూర్‌కు చెందిన రైతు 512 కిలోల ఉల్లిగడ్డలు ఓ దళారికి విక్రయించాడు. అందుకు బదులుగా అతనికి దక్కింది ఎంతో తెలుసా..? కేవలం రూ.2.49. నిజమే అన్ని కిలోల ఉల్లిగడ్డలు అమ్మితే వచ్చింది రెండు రూపాయలు మాత్రమే. సోలాపూర్‌లోని బర్షి తాసీలుకు చెందిన 63 ఏళ్ల రాజేంద్ర చవాన్‌కు ఎదురైంది ఈ అనుభవం. కిలో ఉల్లిగడ్డ రూ.1 లెక్కన అమ్మాలని తన కొడుక్కి చెప్పాడు. అయితే...అన్ని అమ్మాక ఖర్చులు పోను తనకు మిగిలింది ఇంతే అని రిసీట్ చూపించాడు రైతు. 5 క్వింటాళ్లకు పైగా 10 బస్తాల ఉల్లిగడ్డలను మార్కెట్ యార్డ్‌కు పంపినట్టు చెప్పాడు. అంతా పోగా రూ.2 లాభం వచ్చిందని వివరించాడు. నిజానికి రైతు పంపింది 512 కిలోలు. అయితే...రవాణా ఖర్చులతో పాటు హమాలీ ఖర్చులు పోగా కేవలం 509 కిలోలకు మాత్రమే లెక్క కట్టాడు దళారి. అప్పటికే నష్టం అనుకున్న రైతుకు..చివరకు 2 రూపాయల రసీదు ఇచ్చి షాక్ ఇచ్చాడు. దీనిపై రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకే కాకుండా రైతులందరికీ జరిగిన అవమానం అని అన్నాడు. 


"ఇంత తక్కువ లాభం వస్తే నేను  బతికేది ఎలా..? ఉల్లి రైతులందరికీ న్యాయం జరగాలి. బాధితులందరికీ పరిహారం అందించాలి. మేం మంచి క్వాలిటీ ఉల్లిగడ్డల్ని మార్కెట్‌కు తీసుకొస్తున్నా దళారులు నాణ్యత లేదంటూ తక్కువ ధరే ఇస్తున్నారు. ఇలా అయితే మేం ఎలా బతకాలి" 


- బాధిత రైతు 




విధానాలు సరిగా లేవా..? 


అయితే గతంలో 400 బస్తాల ఉల్లిగడ్డలు అమ్మి లాభం పొందానని ఈ సారి మాత్రం ఆవేదన తప్పడం లేదని చెప్పాడు రైతు. అయితే దీనిపై మాజీ ఎంపీ రాజు శెట్టి స్పందించారు. ప్రస్తుతం వస్తున్న ఉల్లిగడ్డ ఖరీఫ్ సీజన్‌ది అని...ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేమని వివరించారు. ఇప్పటికిప్పుడు ఈ ఉల్లిగడ్డల్ని పూర్తి స్థాయిలో విక్రయించాల్సిన అవసరముందని చెప్పారు. వీలైనంత త్వరగా వీటిని ఎగుమతి చేయాలని సూచించారు. అంతే కాదు. ఉల్లిగడ్డలకు సంబంధించి ప్రభుత్వ ఎగుమతి, దిగుమతి విధానాలు సరిగా లేవని విమర్శించారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు ఎక్కువ మొత్తంలో ఉల్లిగడ్డల్ని ఎగుమతి చేస్తుంది భారత్. అయితే భారత్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆ రెండు దేశాలు ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. వీటిలో మార్పులు చేర్పులు చేస్తే కొంత మేర పరిస్థితులు మెరుగు పడే అవకాశాలున్నాయని సూచిస్తున్నారు మార్కెట్ నిపుణులు. 


Also Read: Ideas of India Summit 2023: ప్రపంచంలోనే ఇండియా నంబర్ వన్‌గా ఉండాలి, లిక్కర్ స్కామ్ అంతా ఫేక్ - కేజ్రీవాల్