ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో ఎప్పుడూ దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ వేట ప్రారంభించనుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఆసియా కప్‌ ఫైనల్లో ఓటమి నుంచి బయటపడి తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలని లంక భావిస్తుండగా... తొలి మ్యాచ్‌లో గెలిచి విశ్వ సమరంలో తొలి అడుగు బలంగా వేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దిల్లీ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో పటిష్ట స్పిన్‌ విభాగం ఉన్న లంక బౌలింగ్‌ను ప్రొటీస్‌ జట్టు ఎలా ఎదుర్కొంటుందో అన్న ఆసక్తి నెలకొంది.  ఆసియా కప్‌లో ఫైనల్‌ చేరి శ్రీలంక.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో ఉన్నాయి. 

 

ఆత్మ విశ్వాసంతో సాగాలని..

బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా, దసున్ షనక నేతృత్వంలోని శ్రీలంకకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని  ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రోటీస్ , శ్రీలంక మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు. రెండు వార్మప్ మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన శ్రీలంక తొలిపోరులో ఎలాం పుంజుకుంటుందో చూడాలి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలాగే ఉంది. అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన తొలి వార్మప్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దుకాగా.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ వార్మప్ మ్యాచ్‌లో ప్రొటీస్‌ జట్టు ఓడిపోయింది. ఇరు జట్లుకు సమాన గెలుపు అవకాశాలు ఉన్న ఈ మ్యాచ్‌లో ఎవరు విజయ కేతనం ఎగరేస్తారో చూడాలి. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా-శ్రీలంక 80 సార్లు వన్డేల్లో తలపడగా ప్రొటీస్‌ జట్టు 45 మ్యాచ్‌ల్లోనూ... శ్రీలంక 33 మ్యాచ్‌ల్లోనూ గెలిచాయి. ఒక మ్యాచ్‌ టై అయింది. ఈ గణాంకాల ప్రకారం లంకపై దక్షిణాఫ్రికా జట్టే బలంగా కనిపిస్తున్న తమదైన రోజున లంక ఏ జట్టునైనా ఓడిస్తుందనడంలో సందేహం లేదు.

 

పిచ్‌ రిపోర్ట్‌

ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు, పిచ్‌ నెమ్మదిగా స్పందిస్తుందని మాజీలు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లతో పోలిస్తే రెండో బ్యాటింగ్ చేసే జట్లకు విజయావకాశాలు ఎక్కువగా 

ఉన్నాయని గత రికార్డులు చెబుతున్నాయి. 

 

వెదర్‌ రిపోర్ట్‌

ఢిల్లీలో వర్షం పడే సూచనలు లేవు. వాతావరణం ఆశాజనకంగా కనిపిస్తోంది. గాలి వేగం గంటకు 11 కి.మీ. ఉండే అవకాశం ఉంది. 

 

దక్షిణాఫ్రికా జట్టు(అంచనా‌)

క్వింటన్ డి కాక్, బావుమా (కెప్టెన్‌), ఐడెన్ మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి 

శ్రీలంక జట్టు (అంచనా‌)

శ్రీలంక: కుసల్-మెండిస్, కుసల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్‌), చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, ధనంజయ డి సిల్వా, కసున్ రజిత, మహేశ్ తీక్షణ, మతీషా పతిరనా