ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఇరగదీస్తోంది. భారత జట్టులో కొవిడ్‌-19 ప్రకంపనలు సృష్టించినా వరుస విజయాలు సాధించింది. మరోసారి ఫైనల్‌ చేరుకొని సత్తా చాటింది. తుది సమరానికి ముందు కుర్రాళ్లకు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విలువైన సలహాలు ఇచ్చాడు.


ఇప్పటి వరకు భారత జట్టు నాలుగు సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచింది. ఈ ఈవెంట్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్టు మనదే. తాజాగా మరోసారి కప్పు ముంగిట నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఇంగ్లాండ్‌ను ఫైనల్లో ఢీకొట్టనుంది. ఇందులో గెలిస్తే ఐదుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఏకైక జట్టుగా యువ భారత్‌ నిలుస్తుంది. అందుకే ఈ కీలక సమరానికి ముందు విరాట్‌ కోహ్లీతో కుర్రాళ్లకు వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.


అండర్‌-19 సారథిగా విరాట్‌ కోహ్లీకి మంచి అనుభవమే ఉంది. 2008లో అతడి నాయకత్వంలో కుర్ర జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. అతడు జట్టును నడిపించిన తీరు అందరికీ ఆకట్టుకుంది. ఇక సీనియర్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గానూ అతడు రికార్డు సృష్టించాడు. ఫైనల్‌కు ముందు అతడి సలహాలు జట్టుకు ఉపయోగపడతాయని బీసీసీఐ భావించింది. అతడితో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కుర్ర క్రికెటర్లు పంచుకున్నారు.


Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?


Also Read: India Enters U19 Finals: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై ఘనవిజయం.. ఫైనల్స్ గెలిస్తే చరిత్రే!


'ఫైనల్స్‌కు ముందు GOAT (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) నుంచి కొన్ని విలువైన సలహాలు అందుకున్నాం' అని అండర్‌-19 ఆఫ్‌ స్పిన్నర్‌ కుశాల్‌ తంబె ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 'మీతో మాట్లాడటం చాలా బాగుంది విరాట్‌ కోహ్లీ భయ్యా. జీవితం, క్రికెట్‌ఫై మీ నుంచి కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకున్నాం. మున్ముందు మేం మరింత మెరుగయ్యేందుకు అవి మాకు సాయం చేస్తాయి' అని ఆల్‌రౌండర్‌ రాజ్‌వర్ధర్‌ హంగర్‌గేకర్‌ అన్నాడు.


వెస్టిండీస్‌ వేదికగా ఈ సారి అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగుతోంది. యశ్‌ధుల్‌ కెప్టెన్సీ చేస్తున్నాడు. అతడికి ఆంధ్రా క్రికెటర్‌ షేక్‌ రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గా సాయపడుతున్నాడు. ఒకట్రెండు మ్యాచులు కాగానే భారత జట్టులో కొందరికి  కొవిడ్‌ సోకింది. దాంతో రిజర్వు సభ్యులతో కలిసి టీమ్‌ఇండియా మ్యాచులు ఆడి గెలిచింది. కీలకమైన సెమీస్‌లో ఆసీస్‌పై యశ్‌ సెంచరీ కొట్టాడు. షేక్‌ రషీద్‌ (94) సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరూ ఫైనల్లోనూ ఇలాగే చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.