2022 ఐపీఎల్‌ను వీలైనంత వరకు భారత్‌లోనే నిర్వహించేలా చూస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. కరోనావైరస్ భారీ స్థాయికి చేరకపోతే కచ్చితంగా ఐపీఎల్ మనదేశంలోనే జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


భారత్‌లో పూర్తిస్థాయిలో ఐపీఎల్ జరిగి రెండేళ్లు పైనే అవుతుంది. 2020 ఐపీఎల్ పూర్తిగా యూఏఈలో జరగగా.. 2021 ఐపీఎల్ మొదటి భాగం మనదేశంలో, రెండో భాగంల యూఏఈలో జరిగింది. మొదటి భాగం సగం పూర్తయ్యాక ఆటగాళ్లకు కరోనా సోకడమే దీనికి కారణం. ముంబై, పుణేల్లో ఐపీఎల్ 15వ సీజన్ నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు గంగూలీ తెలిపారు. అయితే ప్రేక్షకులకు ఆహ్వానం ఉంటుందో లేదో తెలియరాలేదు. నాకౌట్ మ్యాచ్‌ల వేదికలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.


అయితే ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం కూడా గంగూలీ తెలపలేదు. పూర్తి స్థాయిలో షెడ్యూల్ సిద్ధం అయ్యాక దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, అహ్మదాబాద్ జట్లు కూడా ఈ ఐపీఎల్‌లో ఆడనున్నాయి. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది.


దీంతోపాటు ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళ టీ20 చాలెంజ్ పోటీలను కూడా నిర్వహిస్తామని గంగూలీ తెలిపారు. ఈ పోటీలో గతంలో కూడా జరిగాయి. మొత్తం మూడు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీ పడతాయి. 2018లో ఈ పోటీలు ప్రారంభం అయ్యాయి. అయితే కరోనా కారణంగా 2021లో ఈ పోటీలను నిర్వహించలేదు. ఐపీఎల్ 2022లో వీటిని మళ్లీ జరపనున్నట్లు గంగూలీ పేర్కొన్నారు.


గత కొద్ది కాలంగా మహిళల క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. భవిష్యత్తులో మహిళల ఐపీఎల్ కూడా నిర్వహించే అవకాశం ఉందని గంగూలీ అన్నారు. కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాక దేశవాళీ మహిళల క్రికెట్‌ను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా వేలానికి మొత్తం 590 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహల్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్, ప్యాట్ కమిన్స్, ఫాఫ్ డుఫ్లెసిస్, జోఫ్రా ఆర్చర్ వంటి పెద్ద పేర్లు కూడా వేలంలో చూడవచ్చు.


10 ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ ఆటగాళ్లు, టాలెంటెడ్ యంగ్‌స్టర్స్‌తో జట్టును బలోపేతం చేసుకోవడానికి అన్ని ఐపీఎల్ టీమ్స్ ప్రయత్నిస్తాయి.