టీమ్‌ఇండియా చేయాల్సిన పనిని 'దగ్గరి మిత్రుడు' న్యూజిలాండ్‌ చేసి చూపించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొనేందుకు చివరి వరకు పోరాడింది. దాదాపుగా మన దాయాది పాకిస్థాన్‌ను ఓడించేందుకు ప్రయత్నించింది. ఛేదన ఆరంభంలో మహ్మద్‌ రిజ్వాన్‌ (33; 34 బంతుల్లో 5x4), ఆఖర్లో షోయబ్‌ మాలిక్‌ (27*; 20 బంతుల్లో 2x4, 1x6), అసిఫ్‌ అలీ (27*; 12 బంతుల్లో 1x4, 3x6)  రాణించడంతో పాక్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు కివీస్‌లో కేన్‌ విలియమ్సన్‌ (25; 26 బంతుల్లో 2x4, 1x6), డేవాన్‌ కాన్వే (27; 24 బంతుల్లో 3x4), డరైల్‌ మిచెల్‌ (27; 20 బంతుల్లో 1x4, 2x6) ఫర్వాలేదనిపించారు.


16 ఓవర్ల వరకు కివీస్‌దే..!


పాక్‌ ఫామ్‌కు కివీస్‌ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ పిచ్‌ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్‌ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. మైదానంలో ఫీల్డర్లు చురుగ్గా కదిలారు. 16 ఓవర్ల వరకు పాక్‌ను భయపెట్టారు. ఓపెనర్‌ రిజ్వాన్‌ ఒక్కడే 12 ఓవర్ల వరకు నిలబడి పరుగులు చేశాడు. బాబర్‌ ఆజామ్‌ (9), ఫకర్‌ జమాన్‌ (11), మహ్మద్‌ హఫీజ్ (11), ఇమాద్‌ వసీమ్‌ (11) త్వరగా పెవిలియన్‌ చేరడంతో 16 ఓవర్లకు పాక్‌ 98/5తో ఇబ్బందుల్లో పడింది. 17 ఓవర్లో అసిఫ్‌ అలీ రెండు సిక్సర్లు బాది ఒత్తిడి తగ్గించాడు. తర్వాతి ఓవర్లో షోయబ్‌ మాలిక్‌ సిక్సర్‌, ఫోర్‌ బాదేయడంతో సమీకరణం సులువైంది. ఆ తర్వాతి ఓవర్లో అలీ మరో సిక్సర్‌ దంచడంతో పాక్‌ వరుసగా రెండో విజయం అందుకుంది. ఇది ఒకందుకు టీమ్‌ఇండియాకు మంచిదే. సెమీస్‌ చేరేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.


ముగ్గురి పోరాటం


టాస్‌ ఓడిపోవడంతో న్యూజిలాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. తొలి మ్యాచ్‌లాగే పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్‌ (17), డరైల్‌ మిచెల్‌ (27) 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. మంచి బంతుల్ని వీరు గౌరవిస్తూనే బౌండరీలు బాదేశారు. గప్తిల్‌ను రౌఫ్‌ బౌల్డ్‌ చేసినా ఒకసారి లైఫ్‌ పొందిన విలియమ్సన్‌ (25) వికెట్ల పతనం అడ్డుకున్నాడు. స్పిన్నర్లపై దాడి చేశాడు. కానీ జట్టు స్కోరు 54 వద్ద 2 పరుగుల వ్యవధిలో మిచెల్‌, నీషమ్‌ (1) ఔటయ్యారు. ఈ క్రమంలో డేవాన్‌ కాన్వే (27) తోడుగా విలియమ్సన్‌ 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కీలక సమయంలో అనవసర పరుగుకు యత్నించిన కేన్‌ను అద్భుతమైన మెరుపు త్రోతో హసన్‌ అలీ ఔట్‌ చేశాడు. ఫిలిప్స్‌ (13)తో కాన్వే 26 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేయడంతో స్కోరు వంద దాటింది. ఆఖర్లో రౌఫ్‌ (4/22)  సహా పాక్‌ బౌలర్లు పుంజుకోవడంతో కివీస్‌ 134/8కి పరిమితమైంది.


Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి