ICC Rankings: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేసినప్పటి నుంచి రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మరో పెద్ద రికార్డు సాధించాడు. ఈ సందర్భంలో అతను స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లను కూడా దాటేశాడు.


ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ చాలా కాలంగా టీ20 ఇంటర్నేషనల్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో రేటింగ్ పాయింట్ల విషయంలో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లను కూడా వెనక్కి నెట్టాడు సూర్య.


అంతర్జాతీయ టీ20లో అత్యధిక రేటింగ్ పాయింట్లు
తాజా ర్యాంకింగ్స్‌లో, సూర్యకుమార్ యాదవ్ 908 రేటింగ్ పాయింట్లతో టీ20 ఇంటర్నేషనల్‌లో నంబర్ వన్‌గా ఉన్నాడు. ఈ రేటింగ్ పాయింట్లు టీ20 ఇంటర్నేషనల్‌లో ఏ భారతీయ బ్యాట్స్‌మెన్‌ సాధించలేకపోయాడు. అంతకుముందు ఈ రికార్డు 897 పాయింట్లతో విరాట్ కోహ్లీ పేరిట ఉంది.


కేఎల్ రాహుల్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 854 అత్యధిక రేటింగ్ పాయింట్లను కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 900 రేటింగ్ మార్కును దాటిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఈ రికార్డు మరెవరైనా బద్దలు కొడతారేమో చూడాలి.


శ్రీలంకపై సెంచరీ సాయం చేసింది
శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ శతకం సాధించాడు. అతను 51 బంతుల్లో 112 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 219.61గా ఉంది.


సూర్యకుమార్ యాదవ్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ఈ శతకం తర్వాతే సూర్యకు ర్యాంకింగ్స్‌లో ఈ రేటింగ్ పాయింట్లు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచాడు. రోహిత్ శర్మ మాత్రమే నాలుగు సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.