Vande Bharat Express : దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చింది. బుధవారం విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చిన వందే భారత్ రైలను అధికారులు పరిశీలించారు. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చే వందే భారత్ ట్రైన్ కు ప్రయాణికుల తాకిడి ఉంటుందని అధికారులు తెలిపారు. వందే భారత్ లో పూర్తిగా చైర్ కార్ బోగీలుంటాయని వెల్లడించారు. కేవలం 8.40 గంటల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ చేరుకున్న వందే భారత్ రైలును నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు తరలించారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
రైలుపై రాళ్లదాడి
గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు.
180 కి.మీ వేగంతో
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా విశాఖ చేరుకుంటుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గరిష్ఠంగా 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. దేశవ్యాప్తంగా ఐదు రైళ్లు పట్టాలెక్కాయి. మైసూర్-బెంగళూరు-చెన్నై మధ్య నవంబర్ 10న వందే భారత్ రైలు పట్టాలెక్కింది. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్.
సెమీ హై స్పీడ్ ట్రైన్
వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్లను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు. వందే భారత్ ట్రైల్ రన్స్ సక్సెస్ అవుతుండటంతో.. త్వరలో వాటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతారు. ఇవి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నాయి. దేశంలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన ఐదు రైళ్లను పలు ప్రాంతాల్లో పట్టాలెక్కించారు.
10 గంటల్లోనే గమ్యస్థానాలకు
అత్యంత ఆధునిక, వేగవంతమైన రైలు అయినప్పటికీ ప్రస్తుతానికి ఇందులో బెర్తులు లేవు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ మాదిరిగా కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం, రాత్రంతా ప్రయాణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గరిష్ఠంగా 10 గంటల్లోనే చేరే గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి లేదా రాత్రి 9, 10 గంటల్లోపు గమ్య స్థానం చేరేలా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు న్యూఢిల్లీ నుంచి ఉత్తర జమ్మూలోని వారణాసికి అలాగే వైష్ణో దేవితో బెంగళూరు మీదుగా మైసూరు, చెన్నైతో కలుపుతున్నాయి. వాస్తవానికి, రాబోయే మూడేళ్లలో చాలా పెద్ద, మధ్య తరహా నగరాలను కలుపుతూ 400 కొత్త తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని పెరంబూర్‌లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసింది.