Mlc Kadiyam Srihari : కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. హన్మకొండలో కడియం శ్రీహరితో పాటు మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎంపీ పసునూరి దయాకర్ లు మీడియా సమావేశం నిర్వహించారు.


అసమానతలు పెంచేలా కేంద్రం వ్యవహరిస్తోంది-కడియం శ్రీహరి


దేశంలో అసమానతలను పెంచేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. దళిత మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలన్నారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఆయన విమర్శించారు. ఆహారపు ఆలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని ధ్వజమెత్తారు.  1961 నుంచి 2021 వరకు అరవై ఏళ్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచలేదని ఆరోపించారు. దేశ జనాభాలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో అంబేడ్కర్ ఇచ్చిన దళితుల హక్కులను కాలరాయొద్దని కేంద్రాన్ని కోరారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు.


ఆర్ఎస్ఎస్ కుట్ర ఉంది- మాజీ ఎంపీ సీతారాం నాయక్


60 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడంపై ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. యాభై శాతం కన్నా ఎక్కువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మసీదులను కూలగొట్టాలంటుండు..సంజయ్ కు బుద్ధుందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు యువతను వక్రమార్గంలో తీసుకెళుతున్నారని విమర్శించారు.


స్టేషన్ ఘణపూర్ లో శ్రీహరి వర్సెస్ రాజయ్య 


తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పలు జిల్లాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు, కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓవైపు ప్రతిపక్షాలు ఊపిరి సలపని విధంగా విమర్శలు, ఆరోపణలతో అటాక్ చేస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే వేరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అధికార బీఆర్ఎస్ నేతలు. తాజాగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతోంది. 


దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు 


కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని కడియం ఆరోపించగా.. చిల్లర మాటలు నమ్మవద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థిక చేయూత కల్పించేందుకు, సమాజంలో వారు మరో అడుగు ముందుకు వేసేందుకు దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో దళిత బంధు నిధులు విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులను అందించారు. కొన్ని యూనిట్లుగా మారి సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా నిధుల పంపిణీ జరుగుతోంది.


ప్రజా ప్రతినిధుల బంధువులకు దళితబంధు నిధులు ! 


ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. కొందరు ప్రజా ప్రతినిధులు వాళ్ల బంధువులకు దళితబంధు నిధులు ఇవ్వడం, లేదంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ఎస్సీల కోసం తీసుకొచ్చిన పథకం దళిత బంధు అద్భుతమైన పథకం అని, కానీ కొందరు ఆ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు .