Jasprit Bumrah Reclaims Number 1 Spot : టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూసుకెళ్తున్నాడు! ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరిగి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో 6 వికెట్లతో చెలరేగడంతో నాలుగు స్థానాలు ఎగబాకాడు. 718 రేటింగ్‌ పాయింట్లతో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. అతడి ఖాతాలో 712 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌ పేసర్‌ షాహిన్ షా ఆఫ్రిది మూడో స్థానానికి పరిమితం అయ్యాడు.


రెండేళ్ల వరకు అగ్రస్థానంలో ఉన్న జస్ప్రీత్‌ బుమ్రాను (Jasprit Bumrah) 2020, ఫిబ్రవరిలో బౌల్ట్‌ వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌కు చేరుకున్నాడు. 2018, నవంబర్‌ 1న వెస్టిండీస్‌పై తిరుగులేని ప్రదర్శనతో అత్యుత్తమ రేటింగ్‌ 841ని అందుకున్నాడు. గాయపడ్డ తర్వాత బుమ్రా లయ దెబ్బతింది. 2021 ప్రపంచకప్‌, 2022 ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. కీలకమైన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు ఫామ్ అందుకోవడం శుభపరిణామం.


ఐసీసీ టాప్‌-10 వన్డే బౌలర్లు



  • జస్ప్రీత్‌ బుమ్రా

  • ట్రెంట్‌ బౌల్ట్‌

  • షాహిన్‌ అఫ్రిది

  • జోష్ హేజిల్‌వుడ్‌

  • ముజీబ్‌ ఉర్ రెహ్మాన్

  • మెహెదీ హసన్‌

  • క్రిస్‌ వోక్స్‌

  • మ్యాట్‌ హెన్రీ

  • మహ్మద్‌ నబీ

  • రషీద్ ఖాన్


ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో జస్ప్రీత్‌ బుమ్రా రెచ్చిపోయాడు. కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలు నమోదు చేశాడు. కేవలం 7.2 ఓవర్లు వేసిన అతడు 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పైగా 3 మెయిడిన్‌ ఓవర్లు విసిరాడు. అతడి బంతుల్ని ఆడేందుకు ఆంగ్లేయులు వణికిపోయారు. ఎప్పుడెలా వికెట్‌ తీస్తాడోనని భయపడ్డారు. జేసన్‌ రాయ్‌ (0), జానీ బెయిర్‌ స్టో (7), జో రూట్‌ (0), లివింగ్‌స్టోన్‌ (0), విలే (21), బ్రైడన్‌ కేర్స్‌ (15)ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ అయ్యారంటే అతడెంత ప్రమాదకరంగా బంతులేశాడో అర్థం చేసుకోవచ్చు.


Also Read: బూమ్‌.. బూమ్‌.. బుమ్రాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ ప్రశంసల జల్లు!