Michael Vaughan on Bumrah: టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాపై (Jasprit Bumrah) ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రపంచ క్రికెట్లో అతడో తిరుగులేని పేసరని అంతా అంటున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌, షాహిన్‌ అఫ్రిదితో పోలిస్తే అతడెంతో పై స్థాయిలో ఉన్నాడని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్ వాన్‌ పొగిడేశాడు. రోజురోజుకీ అతడు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడని వెల్లడించాడు.


ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో జస్ప్రీత్‌ బుమ్రా రెచ్చిపోయాడు. కెరీర్‌ బెస్ట్‌ గణాంకాలు నమోదు చేశాడు. కేవలం 7.2 ఓవర్లు వేసిన అతడు 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పైగా 3 మెయిడిన్‌ ఓవర్లు విసిరాడు. అతడి బంతుల్ని ఆడేందుకు ఆంగ్లేయులు వణికిపోయారు. ఎప్పుడెలా వికెట్‌ తీస్తాడోనని భయపడ్డారు. జేసన్‌ రాయ్‌ (0), జానీ బెయిర్‌ స్టో (7), జో రూట్‌ (0), లివింగ్‌స్టోన్‌ (0), విలే (21), బ్రైడన్‌ కేర్స్‌ (15)ను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ అయ్యారంటే అతడెంత ప్రమాదకరంగా బంతులేశాడో అర్థం చేసుకోవచ్చు. 


'అన్ని ఫార్మాట్లలోనూ జస్ప్రీత్‌ బుమ్రా అత్యుత్తమ బౌలర్‌. ఇందులో ఎలాంటి సందేహం లేదు. షాహీన్‌ అఫ్రిది, ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి పేసర్లు ఇదే కోవకు వస్తారు. పేస్‌, నైపుణ్యం, వుబుల్‌ సీమ్‌, స్వింగ్‌, యార్కర్లు, డిప్పింగ్‌ స్లోవర్‌ బంతులను విసిరే బుమ్రా వీరికి భిన్నం. పైగా రోజురోజుకీ అతడు మరింత మెరుగవుతున్నాడు' అని మైకేల్‌ వాన్‌ క్రిక్‌బజ్‌తో అన్నాడు.


'కొన్నేళ్లుగా జస్ప్రీత్‌ బుమ్రాను బ్యాటర్లు గమనిస్తున్నారు. అయితే టీ20, వన్డే, టెస్టుల్లో అతడిపై ఆధిపత్యం చెలాయించే బ్యాటర్లు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకే అతడు అందరికన్నా ఎంతో ముందున్నాడు' అని వాన్‌ వెల్లడించాడు.


IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్‌ బుమ్రా (6/19), మహ్మద్‌ షమి (3/31)  దెబ్బకు ఇంగ్లాండ్‌ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్‌ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్‌ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్‌ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.