ICC ODI Ranking Virat Kohli: భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కోహ్లి మరోసారి తన పాత స్టైల్‌కి తిరిగి వస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇటీవలే తిరిగి ఫామ్‌లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో అతను అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన చివరి వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (54) చేశాడు. ఈ అర్ధ సెంచరీతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.


వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10 ప్లేయర్ల జాబితా నుంచి విరాట్ కోహ్లి కొంతకాలంగా బయటికి వచ్చాడు. అయితే ఇప్పుడు విరాట్ తిరిగి తన స్థానాన్ని చేరుకుంటున్నాడు. ప్రస్తుతం అతను వన్డే ర్యాంకింగ్స్‌లో 719 రేటింగ్‌లతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మను కూడా వెనక్కు నెట్టాడు. ప్రస్తుత భారత కెప్టెన్ 707 రేటింగ్‌ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.


2023లో రెండు వన్డే సెంచరీలు
విరాట్ కోహ్లీకి 2023 సంవత్సరం చాలా బాగుంది. అతను ఈ సంవత్సరం మొత్తం తొమ్మిది ODIలు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తూ 53.37 సగటు, 116.03 స్ట్రైక్ రేట్‌తో 427 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ వచ్చాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 166 నాటౌట్‌గా ఉంది.


విరాట్ కోహ్లి 2023లో ఇప్పటివరకు మొత్తం 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 15 ఇన్నింగ్స్‌ల్లో 51.71 సగటుతో 724 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.


ఇంటర్నేషనల్ కెరీర్ ఇలా
విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 108 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. అతను టెస్టుల్లో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలతో 8416 పరుగులు, ODIలలో 46 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలతో 12898 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 37 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సహాయంతో 4008 పరుగులు చేశాడు.


భారత క్రికెట్‌లో గత కొన్నేళ్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. 2022లో ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ సాధించి ఫాంలోకి వచ్చాడు. కానీ అతను దానిని టెస్ట్ ఫార్మాట్‌లో కొనసాగించలేకపోతున్నాడు.


అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)లను ఫ్యాబ్ 4 అని పిలుస్తారు. వీరందరూ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన క్లాస్ బ్యాట్స్‌మెన్.


కానీ ప్రస్తుతం ఫ్యాబ్ 4 బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిస్తే ఒకప్పుడు అన్ని విధాలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అట్టడుగు స్థాయికి చేరుకున్నాడు. గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి బ్యాటింగ్ యావరేజీ చాలా పేలవంగా ఉంది. అది 20కి పడిపోయింది. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లాస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సగటు 40గా ఉంది.


ఇది కాకుండా న్యూజిలాండ్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 57 సగటుతో పరుగులు సాధించగా, ఇంగ్లాండ్ మాజీ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ కూడా 52 సగటుతో పరుగులు చేయగలిగాడు.