ICC Mens ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. దాయాది పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టేసింది. 108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు పాక్ 106 పాయింట్లతో ఉంది.
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 111 పరుగుల టార్గెట్‌ను 19 ఓవర్లలోపే 10 వికెట్ల తేడాతో ఛేదించింది. తిరుగులేని విజయం అందుకోవడంతో భారత ర్యాంకు మెరుగుపడింది. అయితే పాక్‌ను కిందే ఉంచాలంటే ఇంగ్లాండ్ సిరీసును టీమ్‌ఇండియా కైవసం చేసుకోవాలి. లేదంటే మళ్లీ కిందకు రావాల్సి వస్తుంది. ఇక న్యూజిలాండ్ (127), ఇంగ్లాండ్ (122) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
నిజానికి టీమ్‌ఇండియా నెల రోజుల ముందు మూడో స్థానంలోనే ఉండేది. సొంతగడ్డపై జరిగిన సిరీసులో వెస్టిండీస్‌ను 3-0తో ఓడించడంతో పాకిస్థాన్ ఆ ర్యాంకుకు చేరుకుంది. అందుకే ఇంగ్లాండ్, ఆ తర్వాత వెస్టిండీస్ సిరీసులను గెలిస్తే హిట్‌మ్యాన్ సేన దాయాదికి అందనంత దూరంలోకి వెళ్తుంది. రెండో స్థానంలోని ఇంగ్లాండ్‌కు చేరువవుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (101), దక్షిణాఫ్రికా (99), బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), అఫ్గానిస్థాన్ (69) వరుసగా 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి.
తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఎలా గెలిచిందంటే?
IND vs ENG, 1st ODI, The Oval Stadium: గెలుపంటే ఇదీ! అన్నట్టుగా చెలరేగింది టీమ్‌ఇండియా. ఆంగ్లేయులకు తమ సొంతగడ్డపైనే కనీవినీ ఎరగని పరాభవం రుచిచూపించింది. మొదట జస్ప్రీత్ బుమ్రా (6/19), మహ్మద్ షమి (3/31) దెబ్బకు ఇంగ్లాండ్ కేవలం 25.2 ఓవర్లకే 110 పరుగులకే కుప్పకూలింది. చరిత్రలోనే టీమ్‌ఇండియా చేతిలో అత్యల్ప స్కోరుకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6x4), డేవిడ్ విలే (21; 26 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్లంటేనే మన బౌలర్ల అటాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఆ తర్వాత రోహిత్ శర్మ (76; 58 బంతుల్లో 7x4, 5x6), శిఖర్ ధావన్ (31; 54 బంతుల్లో 4x4) ఇద్దరే కలిసి 10 వికెట్ల తేడాతో గెలిపించేశారు. విజయం కోసం కేవలం 18.4 ఓవర్లే తీసుకున్నారు.
ఫామ్‌లోకి హిట్‌మ్యాన్
ఎదురుగా 111 పరుగుల స్వల్ప లక్ష్యం! ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరుగుల వరదకు అనుకూలించే పిచ్! ఇంకేముంది టీమ్‌ఇండియా సునాయాసంగా టార్గెట్ ఛేదించేసింది. టీ20 సిరీసులో ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూకుడుగా ఆడాడు. 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. సొగసైన బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ (Shikar Dhawan) ఆచితూచి ఆడాడు. హిట్‌మ్యాన్‌కే ఎక్కువ స్ట్రైక్ అందించాడు. సెకండ్ ఫెడల్ ప్లే చేశాడు. దాంతో 10 ఓవర్లకు ముందే టీమ్‌ఇండియా స్కోరు 50కి చేరుకుంది. ఆ తర్వాత వికెట్ పడకుండా జట్టును గెలుపు తీరానికి చేర్చారు.