ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (4/94, 4/32) కలిపి మొత్తంగా 8 వికెట్లతో సిరాజ్‌ అదరగొట్టాడు. ఈ పర్యటనలో సిరాజ్‌లో అభిమానులు కొత్తదనం చూశారు. వికెట్ తీసిన సమయంలో నోటిపై వేలు వేసుకుని చూపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలపై పలువురు పలు విధాలుగా కూడా స్పందించారు. 






దీంతో కొద్ది రోజుల పాటు సిరాజ్ సెలబ్రేషన్స్ పై విమర్శలు వచ్చాయి. అప్పుడు ఆ విమర్శలపై సిరాజ్ స్పందించాడు. తన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు, తన వల్ల ఏమీ కాదని అన్న వాళ్లను నోరు మూసుకో అన్నట్లుగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు అతడే స్వయంగా ఓ మీడియా సమావేశంలో వివరించాడు.  పలు చోట్ల ఈ సెలబ్రేషన్స్ కి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఏంటి... మన సిరాజ్ ప్రదర్శనకు భాగ్యనగర వాసులు ఫిదా అయిపోయారు. సాధారణంగా ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు విడుదలైనప్పుడు వారికి సంబంధించిన భారీ కటౌట్లు థియేటర్లు, పలు చోట్ల పెట్టి అభిమానులు సందడి చేస్తుంటారు. 


Also Read: IPL: కోహ్లీ RCB జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లు... ఎవరి స్థానాల్లో ఎవరంటే?


ఇప్పుడు సిరాజ్‌కి అదే గౌరవం దక్కింది. హైదరాబాద్ పాత బస్తీలో ఓ మూడంస్థుల భవనానికి సిరాజ్‌ నోటి పై వేలు వేసుకుని సెలబ్రేషన్స్ చేసుకునేట్టు ఉన్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ' హైదరాబాద్‌ కా షాన్‌, సిరాజ్‌ కంగ్రాట్స్, సిరాజ్‌ ఈజ్‌ సూపర్‌ స్టార్‌, హైదరాబాద్ రజనీకాంత్' అంటూ క్యాప్షన్‌ జత చేశారు.  


ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ X ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లీడ్స్‌ వేదికగా ఈ నెల 25న ప్రారంభంకానుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.