మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ కేంద్రంగానే ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయి. ప్రతి రాజకీయ పరిణామం దాని చుట్టే తిరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో తాను రాజీనామా చేసిన మళ్లీ గెలిచి కేసీఆర్‌కు తన ప్రతాపం ఏంటో చూపాలని బీజేపీ నేత ఈటల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థిగా ఆయన పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆయనే బరిలో ఉంటారన్నది వాస్తవం. మరోవైపు, ఆయన దూకుడుతో ముందస్తుగానే మేల్కొన్న టీఆర్ఎస్ పార్టీ దళితబంధు సహా ఎన్నో బలమైన కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ నేపథ్యం ఉన్న యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల వారు తమ అభ్యర్థులను బరిలో నిలపగా.. కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. 


అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌ దామోదర ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ముగ్గురు నేతల పేర్లతో కూడిన జాబితా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు అందజేశారు. బీసీ, ఎస్సీ, ఓసీ అభ్యర్థుల పేర్లు సిఫారసు చేయగా.. బీసీ కేటగిరి నుంచి కొండా సురేఖ, ఓసీ కేటగిరి నుంచి కృష్ణారెడ్డి, ఎస్సీ కేటగిరి నుంచి సదానందం పేర్లను సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. హుజూరాబాద్‌ టీఆర్ఎస్ టికెట్‌ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌ రెడ్డి ఫోన్​లో మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ టీఆర్ఎస్ టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పుకొచ్చారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని..  ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4 నుంచి 5 వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ ఫోన్ సంభాషణ వైరల్‌గా మారటంతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 


దీంతో కౌశిక్​రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్​ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్‌ ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినందున కౌశిక్‌ రెడ్డికి నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు.