భద్రత కల్పించాల్సిన పోలీసే బాధ్యత మరిచాడు. పదో తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో ఎవరూ లేని సమయంలో రమేష్ అనే కానిస్టేబుల్ ఓ బాలికను తన ఇంట్లోకి పిలిచాడు. తెలిసిన వ్యక్తి అవ్వడంతో బాలిక కానిస్టేబుల్ ఇంటికి వెళ్లింది. బాలికతో కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. కొత్తపేట స్టేషన్‌లో రమేష్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కానిస్టేబుల్ కు దేహశుద్ధి
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేక సమయంలో కానిస్టేబుల్ పదో తరగతి బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ కు దేహశుద్ధి చేశారు. అండగా నిలవాల్సిన కానిస్టేబులే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.రమేష్ 2019లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.
బాలికతో అసభ్య ప్రవర్తన
గుంటూరులోని కొత్తపేట పోలీస్ స్టేషన్ లో రమేష్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంతోపాటు ఓ ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. అదే ఇంట్లో కింద పోర్షన్ లో మహిళా ప్రిన్సిపాల్ కుటుంబం ఉంటున్నారు. పదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్ చనువుగా ఉంటున్నాడు. తరచూ బాలికతో మాట్లాడేందుకు రమేష్ ప్రయత్నిస్తుండడంతో బాలికతో మాట్లాడొద్దని ఆమె కుటుంబ సభ్యులు హెచ్చరించారు.
Also Read: YS Viveka Case: వైఎస్ వివేకా హంతకులెవరు?... ఆచూకీ చెబితే 5 లక్షలు నజరానా
స్పందించిన లోకేశ్
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అమానవీయ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. పోలీసులే అఘాయిత్యాలకు పాల్పడితే ఆడబిడ్డల కష్టాలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. దిశ చట్టం ప్రచారానికి తప్ప అమల్లో లేదని, ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవా అని నిలదీశారు. ఇంత దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్ కు 21 రోజుల్లో శిక్ష వెయ్యకుండా కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.