ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్‌ నేత జీవీ శ్రీరాజ్‌ను పార్టీ నుంచి కాంగ్రెస్‌ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. దీనికి కారణం ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం కాదు. పార్టీ కోసం అత్యుత్సాహంతో చేసిన ఓ పనే బూమరాంగ్ అవడం పార్టీ హైకమాండ్‌కు తలనొప్పులు సృష్టించడంతో జీవీశ్రీరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 


కాంగ్రెస్ పార్టీకి, ట్విట్టర్‌కు మధ్య ఇటీవలి కాలంలో వివాదం ప్రారంభమయింది. ఢిల్లీలో రేప్ బాధితురాలి కుటుంబాన్ని అందరికీ తెలిసేలా ఫోటో పోస్ట్ చేశారన్న కారణంగా ట్విట్టర్ రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కార్యకర్తలు చాలా మంది తమ ట్వీట్టర్ అకౌంటర్ పేర్లను రాహుల్ గాంధీగా మార్చుకున్నారు. మరికొంత మంది మరో విధంగా నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే అందరి కంటే భిన్నంగా కొత్తగా ఏదైనా చేయాలనుకున్న ఏపీ యువజన కాంగ్రెస్ నేత జీవీ శ్రీరాజ్.. ఓ  పిట్టను పట్టుకుని దాన్ని చంపి ఫ్రై చేశారు.  దాన్నిట్విట్టర్ కార్యాలయానికి కొరియర్ చేస్తున్నట్లుగా వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


జీవీ శ్రీరాజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆగ్రహించింది. ఇలాంటి పనులు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని  శ్రీరాజ్‌ వ్యవహారశైలితో రాహుల్‌గాంధీ ప్రతిష్ఠను దిగజారిందని అభిప్రాయానికి వచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. తాను రాహుల్ గాంధీపై అభిమానంతోనే.. ట్విట్టర్‌కు నిరసన తెలిపాను కానీ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లుగా అనుకోలేదని ఆయన తన అభిప్రాయాన్ని పంపినా ప్రయోజనం లేకపోయింది. 


జీవీ శ్రీరాజ్ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరినా ఇటీవలే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  అయితే తన కుమారుడిపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఆయన కూడా ఫీలయ్యారు. తను కూడా రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. తమ తప్పేమీ లేదని ఆయన వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత తీవ్రంగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఇమేజ్‌పైనే మచ్చ పడేలా ఆ నిరసన ఉందన్న కారణంగా ఆయనపై చర్య తీసుకున్నారు. నిజంగా పిట్టను చంపకపోయినట్లయితే సమస్య ఉండేది కాదని.. కొంత మంది అంటున్నారు.