Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రేపు హైదరాబాద్ లో ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. సానియా మీర్జా ఇప్పటికే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. తన కెరీర్ లో చివరి మ్యాచ్ హైదరాబాద్ లో ఆడాలని సానియా నిర్ణయం తీసుకున్నారు.  ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హోమ్ టౌన్ లో అభిమానుల కోసం ఆడబోతున్న ఈ మ్యాచ్ కు ఫుల్ క్రేజ్ ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.  


హైదరాబాద్ లో లాస్ట్ మ్యాచ్  


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే టెన్నిస్ ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్‌ లో తన లాస్ట్ మ్యాచ్ ఆడాలని ఆశించిన సానియా మీర్జా అభిమానుల కోసం ఆదివారం ఎల్బీ స్టేడియం‌లో ఫేర్‌‌వెల్ మ్యాచ్‌ ఆడనుంది. దీంతో హైదరాబాద్ లోని అభిమానులు సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్‌ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌తో తనకి ఉన్న అనుబంధం గురించి సానియా మీర్జా గుర్తుచేసుకున్నారు. ఇకపై ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్లు సానియా చెప్పారు.  2003లో టెన్నిస్‌ కెరీర్ స్టార్ట్ చేసిన సానియా మీర్జా.. దాదాపు 20 ఏళ్లు ఆటలో కొనసాగింది. ఫిబ్రవరి 21న దుబాయ్‌లో జరిగిన టోర్నీలో ఫస్ట్ రౌండ్‌లోనే ఓటమి పాలైన సానియా మీర్జా.. టెన్నిస్‌కి గుడ్ బై చెప్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీపడిన సానియా మీర్జా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.  


ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ 


సానియా మీర్జా తన కెరీర్‌లో మొత్తం ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. మార్టినా హింగిస్‌తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్ టైటిల్స్ గెలిచింది. మరో మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్స్ కైవసం చేసుకుంది. ఇందులో రెండు మహేష్ భూపతితో కలిసి సాధించింది. ఆసియా క్రీడల్లో 8 పతకాలు గెలిచిన సానియా మీర్జా.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కూడా రెండు పతకాలు సాధించింది. ఒలింపిక్స్ పతకం కోసం శ్రమించినా అది కలగానే మిగిలింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచింది సానియా మీర్జా. 


ఎగ్జిబిషన్ మ్యాచ్ 


నేటి తరం అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచిన సానియా మీర్జా... భారతదేశపు అత్యంత విజయవంతమైన టెన్నిస్ క్రీడాకారిణుల్లో ఒకరు. 20 ఏళ్లకు పైగా ఉన్న తన ఆటను కొనసాగించిన సానియా.. ఇటీవలె రిటైర్మెంట్ ప్రకటించింది. తన స్వస్థలమైన హైదరాబాద్ లో రేపు జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్ తో కెరీర్ కు పూర్తిగా వీడ్కోలు పలకనుంది.  
ఈ మ్యాచ్ గురించి సానియా మాట్లాడుతూ... 'నేను నా కెరీర్లో ఊహించిన దానికంటే ఎక్కువ సాధించాను. కోర్టులో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాధించాను. నేను ఎప్పుడూ నా చివరి మ్యాచ్ హైదరాబాద్ లో ఆడాలని నిర్ణయించుకున్నాను. హైదరాబాద్ లో మొదలైన నా కెరీర్ ఇక్కడే ముగియడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.  '  అని సానియా అన్నారు.