Hockey Mens World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచకప్‌ డ్రా వచ్చేసింది. టీమ్‌ఇండియా ఈ సారి పూల్‌-డీలో ఉంది. గ్రూప్‌ దశలో ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, వేల్స్‌తో తలపడనుంది. లీగ్‌ దశలో ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటుంది. ఈ సారి మెగా టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.


ఏ పూల్‌లో ఏ జట్టు


టీమ్‌ఇండియా ప్రస్తుతం ప్రపంచ ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. ఆతిథ్య జట్టు కావడంతో నేరుగా టోర్నీలో చోటు దక్కించుకుంది. ఇదే పూల్‌లో ఉన్న ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, వేల్స్‌ బలమైన జట్లే కావడం గమనార్హం. కాగా కామన్వెల్త్ ఛాంపియన్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ ఆస్ట్రేలియా పూల్‌-ఏలో ఉంది. అర్జెంటీనా, ఫ్రాన్స్‌, చిలీతో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ బెల్జియం, ఏసియా ఛాంపియన్‌ దక్షిణ కొరియా, నాలుగో ర్యాంకు జర్మనీ, జపాన్‌ పూల్‌-బిలో చోటు దక్కించుకున్నాయి. నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, మలేసియా, చిలీ పూల్‌-సిలో ఉన్నాయి. 2023, జనవరి 13న ప్రపంచకప్‌ మొదలవుతుంది. 29న ముగుస్తుంది. భువనేశ్వర్‌లోని కళింగ, రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో మ్యాచులు జరుగుతాయి.


ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రపంచకప్‌ డ్రా తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఎఫ్‌ఐహెచ్‌ సీఈవో థీరీ వీల్‌ హాజరయ్యారు. మొత్తం 16 జట్లు మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, బెల్జియం, నెదర్లాండ్స్‌, జర్మనీ, భారత్‌, ఇంగ్లాండ్‌, అర్జెంటీనా, స్పెయిన్‌, న్యూజిలాండ్‌, మలేసియా వరుసగా టాప్‌-10లో ఉన్నాయి.