India vs South Africa Hockey Men World Cup 2023: హాకీ ప్రపంచ కప్ 2023లో రూర్కెలాలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5-2తో విజయం సాధించింది. ఈ విజయంతో హాకీ ప్రపంచ కప్‌లో భారత్‌ తొమ్మిదో స్థానాన్ని ఖాయం చేసుకుంది.


భారత జట్టు తరఫున సుఖ్‌జిత్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, షంషేర్ సింగ్, అభిషేక్ ఒక్కో ఫీల్డ్ గోల్ చేశారు. కాగా హర్మన్‌ప్రీత్ సింగ్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుని హర్మన్ ప్రీత్ గోల్ సాధించారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.


ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్‌ నుంచే టీమ్‌ ఇండియా దూకుడైన ఆటతీరును కనబరిచింది. నాలుగో నిమిషంలో అభిషేక్ భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. ఆ తర్వాత 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ కొట్టాడు. ఈ విధంగా తొలి క్వార్టర్ ముగిసే సమయానికి భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.


ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో రెండు జట్లూ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. కానీ ఈ క్వార్టర్‌లో కూడా ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నాలు మాత్రం కొనసాగించాయి. టీమ్ ఇండియా తరఫున మూడో క్వార్టర్‌లో షంషేర్ సింగ్ గోల్ చేశాడు. నాలుగో క్వార్టర్‌లో భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌, సుఖ్‌జిత్‌ సింగ్‌ ఒక్కో ఫీల్డ్‌ గోల్‌ చేశారు.


ఈ విధంగా టీమ్ ఇండియా మొత్తం ఐదు గోల్స్ చేసింది. దక్షిణాఫ్రికా నుంచి 48వ నిమిషంలో తొలి గోల్ నమోదు కాగా, 59వ నిమిషంలో రెండో గోల్ నమోదయ్యాయి. కానీ సౌత్ ఆఫ్రికన్ జట్టు గెలవడానికి అవసరమైన గోల్్ సాధించలేకపోయింది. దీంతో భారత్ 5-2తో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా హాకీ ప్రపంచ కప్‌లో టాప్-10లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.


ఈ టోర్నీ నుంచి టీమిండియా మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ దూరం కావడం భారత్‌కు పెద్ద దెబ్బ అయింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ అటాకింగ్ ప్లేయర్‌కు గాయం అయింది. దీంతో అతను ఏకంగా టోర్నీకే దూరం అయ్యాడు. మొదట కేవలం వేల్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండబోడని వార్తలు వచ్చాయి. కానీ టోర్నీ నుంచే దూరం కావాల్సి రావడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది.


టీమిండియా హాకీ టీమ్ లో అటాకింగ్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ రాయ్ కీలక ఆటగాడు. తన అటాకింగ్ గేమ్ తో జట్టుకు చాలాసార్లు ఉపయోగపడేలా ఆడాడు. ఈ మెగా టోర్నీలో స్పెయిన్ పై విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. అలాగే ఇంగ్లండ్ మ్యాచ్ డ్రా గా ముగియడంలోనూ హార్దిక్ ది ప్రధాన పాత్ర.


హార్దిక్ కండరాలు పట్టేశాయి. అతనిని వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వడంతో జట్టు మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన తర్వాత అతను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.


భారత్ చివరిసారిగా 1975లో హాకీ వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఈసారి జట్టు పటిష్టంగా ఉండటంతో విజేతగా నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ క్వార్టర్స్‌కు కూడా చేరలేకపోయారు. 1971 వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన టీమిండియా, 1973 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 1975 విజయం తర్వాత ఒక్కసారిగా కూడా కనీసం సెమీస్‌కు కూడా చేరలేకపోయింది.