పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ జడ్పీ ఉన్నత పాఠశాల, ఉండి గ్రామం ఎన్ఆర్ అగ్రహారంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ మురళి. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవని, అటువంటిది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరికీ ఉత్తమమైన విద్యను అందించే దిశగా ముఖ్యమంత్రి ఎనిమిదో తరగతి నుంచే టాబ్ ల ద్వారా ఎంతో ఖరీదైన బైజూస్ కంటెంట్ బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు ట్యాబులను తీసుకొచ్చి అందులోనే పాఠాలను నేర్చుకోవాలని, ఉపాధ్యాయులు విధిగా ట్యాబ్ లను వినియోగించి వారికి విద్యా బోధన చేయాలని ఆయన సూచించారు. ట్యాబ్ వినియోగంలో విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఆయన అన్నారు.
బాత్ రూంల పరిశీలన
పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు పరిశుభ్రంగా ఉండాలని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. మంచినీరు అందించే ట్యా ప్ లను ఆయన పరిశీలించారు. ప్రతి పాఠశాలల్లో ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి జలాలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యార్థిని విద్యార్థులు విధిగా వినియోగించుకునే విధంగా చూడాలని, విద్యార్థులు మలవిసర్జనకు బయటికి వెళ్లకుండా వారిని మొటివేట్ చేయాలన్నారు. స్కూల్ తెరిచిన దగ్గర నుంచి విద్యార్థులు వినియోగించుకునే విధంగా బాత్రూమ్ లు ఓపెన్ చేసి ఉంచాలని ఆయన సూచించారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడంతోపాటు నీరు పారే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ విద్యార్థిని విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక వాచ్ మెన్ ఏర్పాటుచేస్తామని, వారిని వినియోగించుకుని పాఠశాల ఆస్తులను కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి ట్యాబ్ లు ఏ విధంగా వినియోగంలో ఉన్నాయో ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలల విలీనంపై ఎందుకు లేట్ అయిందో కారణాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్య బోధన ఏ విధంగా చేస్తున్నారు, అర్థమవుతుందా ఎవరెవరు టీచర్లు చెప్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులకు క్లాస్
అధికారులకు క్లాస్ తీసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. సహజంగా దూకుడు విధానం కలిగిన ప్రవీణ్ ప్రకాష్, శాఖల అధికారులపై తనదైన శైలిలో క్లాస్ తీసుకుంటారని ప్రచారం ఉంది. ఇప్పుడు విద్యా శాఖ అదికారులతో మాట్లాడిన ప్రవీణ్ ప్రకాష్, ట్యాబ్ లపై మీకు అవగాహన ఉందా అంటూ ఉపాధ్యాయుల కూడా క్లాస్ తీసుకున్నారంట. కొందరు రిటైర్ మెంట్ కు దగ్గరయిన అధికారులు నిదానంగా సైడ్ అయ్యారని చెబుతున్నారు. మరికొందరు బిక్కముఖం వేయటంతో ఆయన ఇక చాలు వెళ్లండని పంపేశారని చెబుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ 21న బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్..ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు రూ.32 వేల విలువైన ప్రీ అప్ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే.