Hardik Pandya Shares Motivational Message Ahead Of India vs South Africa T20I Series: అంతర్జాతీయ క్రికెట్‌కు తానే దూరమయ్యానని హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. టీమ్‌ఇండియా నుంచి తననెవరూ తప్పించలేదని పేర్కొన్నాడు. విరామం వల్లే తానింత ఫిట్‌గా తయారై తిరిగొచ్చానని వెల్లడించాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడినట్టే టీమ్‌ఇండియాకూ సేవలందించేందుకు పట్టుదలగా ఉన్నానని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం గురించి పాండ్య మాట్లాడిన వీడియోను గుజరాత్‌ టైటాన్స్‌ ట్వీట్‌ చేసింది. అదిప్పుడు వైరల్‌గా మారింది.


'ఆ పాత హార్దిక్‌ పాండ్య మళ్లీ తిరిగొచ్చాడు. ఇప్పుడు అభిమానులూ వచ్చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు నాకిదే సరైన సమయం. మున్ముందు చాలా మ్యాచులు జరగబోతున్నాయి. వాటి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ఫ్రాంచైజీని గెలిపించినట్టే నా దేశానికీ సేవలు అందించాలని పట్టుదలగా ఉన్నా' అని హార్దిక్‌ పాండ్య అన్నాడు.


టీమ్‌ఇండియా నుంచి తననెవరూ తప్పించలేదని పాండ్య స్పష్టం చేశాడు. 'నేను విరామం తీసుకున్నానని చాలామందికి తెలియదు. ఇది పూర్తిగా నా నిర్ణయమే. నన్ను తప్పించారని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుబాటులో ఉంటే కదా తప్పించేది! సుదీర్ఘ విరామం తీసుకొనేందుకు అనుమతించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. త్వరగా అందుబాటులోకి రావాలని నాపై ఒత్తిడి చేయలేదు' అని అతడు వెల్లడించాడు.


హార్దిక్‌ పాండ్య చానాళ్లుగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నాడు. చివరి సారిగా 2021లో టీ20 ప్రపంచకప్‌ ఆడాడు. పని భారం పెరగడం, ఫిట్‌నెస్‌ ఇబ్బందులతో ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మళ్లీ సరికొత్తగా కనిపించాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించాడు. 487 పరుగులు సాధించాడు. బంతితో వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ఫైనల్లో అయితే 17 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసులో పునరాగమనం చేస్తున్నాడు.