గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు చెప్పినప్పుడు అభిమానులు చాలా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు BCCI టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టుకి మెంటార్‌గా ధోనీ వ్యవహరిస్తాడని చెప్పగానే ధోనీ అభిమానులకే కాదు క్రికెట్ అభిమానులు మొత్తం చాలా సంతోషాన్ని కల్గించింది. 






‘తలా ఈజ్ బ్యాక్, జట్టుకి ధోనీ సేవలు చాలా అవసరం, భారత జట్టు మరోసారి ప్రపంచకప గెలవడం ఖాయం’ అంటూ అభిమానులు ధోనీ ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 






ధోనీ నాయకత్వంలో భారత్ అన్ని ICC ఈవెంట్లలో విజయం సాధించింది. 2007 ICC World Twenty20, ఆసియా కప్ - 2010, 2016, 2011 ICC Cricket World Cup,  2013 ICC Champions Trophyలను ధోనీ నాయకత్వంలో టీమిండియా గెలిచింది. ధోనీ అనంతరం పూర్తి స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ ఒక్క ICC టోర్నీ కూడా గెలవలేదు. 






ధోనీ అనుభవాన్ని ఉపయోగించి భారత్ ఈసారి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మెగా టోర్నీలో భాగంగా భారత్... అక్టోబరు 24న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 






అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ధోనీ పది వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడు. 100 స్టంపింగ్స్ చేసిన తొలి వికెట్ కీపర్. 2004 డిసెంబరులో ధోనీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సంవత్సరం అనంతరం టెస్టు క్రికెట్లోకి వచ్చాడు.  ICC ODI Player of the Year - 2008, 2009 అవార్డులను ధోనీ గెలుచుకున్నాడు. వరుసగా రెండు సార్లు ఈ అవార్డు అందుకున్న తొలి ప్లేయర్ ధోనీనే. 






ప్రస్తుతం ధోనీ IPL - 2021 కోసం UAEలో పర్యటిస్తున్నాడు. సెప్టెంబరు 19 నుంచి IPL మిగతా సీజన్ ప్రారంభంకానుంది. అన్ని జట్ల కంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ దుబాయ్ చేరుకుంది. వరుస ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటూ ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. సెప్టెంబరు 19న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్... ముంబయి ఇండియన్స్‌ని ఢీకొట్టనుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది.