తెలంగాణ ప్రభుత్వంపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించింది. ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, దాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు, ఐటీ పరిశ్రమ భాగస్వామ్యం వంటి అంశాలపై గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ పర్యటిస్తోంది. ఈ కమిటీ ఇక్కడ ఉన్న మౌలిక వసతులతో పాటు ఇతర అంశాలపై నేరుగా అధ్యయనం సాగిస్తుంది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబరు 8) ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విజన్ పైన మంత్రి కేటీఆర్, స్థాయి సంఘానికి వివరాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు కురిపించింది.
పార్లమెంటరీ కమిటీ ప్రశంసలు
కచ్చితంగా రానున్న కాలంలో ఇలాంటి వినూత్న కార్యక్రమాలు కొనసాగితే హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆదర్శవంతమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్న తెలంగాణ పద్ధతులను, దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అంశంపైన తాము తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఎక్కడైనా ఆదర్శవంతమైన కార్యక్రమాలు కొనసాగితే వాటి ద్వారా నేర్చుకొని, ప్రజాసంక్షేమం కోసం వాటిని అమలు చేసే విషయంలో ముందు ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్ సేవలు, ఇన్నోవేషన్ రంగంలో ఇంక్యుబేటర్‌ల ఏర్పాటు, టీ ఫైబర్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది.
సమావేశానంతరం కమిటీ అధ్యక్షులు శశిథరూర్‌తో పాటు మిగిలిన పార్లమెంట్ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా ఐటీకి సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలు వాటికి సంబంధించిన అంశాల పైన మంత్రి కేటీఆర్ సంఘానికి వివరించారు. పార్లమెంటరీ కమిటీ అధ్యయనం కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేటీఆర్, ఐటీ శాఖ విభాగాల అధిపతులు పార్లమెంటు సంఘానికి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ సహా ఇతర విధానపరమైన నిర్ణయాలు, ఐటీపరిశ్రమతో కలసి ప్రభుత్వం పని చేయడం వలన అనేక పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు సంబంధించిన అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్లలు 4 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఐటీ ఎగుమతులను సైతం భారీగా పెంచగలిగాం.’’ అని కేటీఆర్ అన్నారు.
మరింత చొరవ కావాలి: కేటీఆర్
తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం అందించడంలో కేంద్రం ప్రభుత్వం మరింత చొరవ చూపించేలా ఇక్కడి విధానాల పైన ప్రత్యేక సిఫార్సు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కమిటీని కోరారు. తెలంగాణ లాంటి నూతన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఐటీఐఆర్ వంటి సమాంతర ప్రాజెక్టుని లేదా అదనపు ప్రోత్సాహాన్ని వెంటనే ప్రకటించే అంశంలో ఈ కమిటీ సహకరించాలని కోరారు.