Kasparov Comments On Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వరల్డ్ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తర్వాత జోక్ అంటూ చెప్పినా దుమారం మరింత రేగిందే తప్ప శాంతించలేదు. తను సరదాగా చేసిన వ్యాఖ్యలు అనవసరంగా పక్కదారి పట్టాయి అని వివరించారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రాజకీయనాయకులే కాదు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మాట్లాడినా అవి పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ గ్యారీ కాస్పరోవ్ చేసిన ట్వీట్. రాహుల్ గాంధీ పోటీపై ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారడంతోపాటు విమర్శలు అదేస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇప్పుడు ఆ పార్టీ కంచుకోట, తన తల్లి సోనియాగాంధీ విడిచిపెట్టిన రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల్లో జనాలతో కలుస్తూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో నిన్న నామినేషన్ వేశారు.. ప్రచారంలో భాగంగా ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ... పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తన అభిమాన చెస్ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ అని, రాజకీయాలన్నా, చెస్ అన్నా తనకు ఇష్టం అన్నారు. రాజకీయాలకు, చదరంగానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న రాహుల్... ఆటపై ఒక్కసారి దృష్టి సారిస్తే ప్రత్యర్థి పావులు సైతం మన సొంతమవుతాయని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చదరంగం ఆటగాడ్ని అని పేర్కొన్నారు. ఈ సరదా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ పోస్టుపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అలా స్పందించిన వ్యక్తుల్లో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ కూడా చేరిపోయారు. చెస్‌లో అగ్రస్థానానికి పోటీపడి గెలిచే ముందు మొదట రాయ్‌బరేలీలో గెలవాలని పోస్ట్ పెట్టారు. రాహుల్‌పై కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాక ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
"నా చిన్న జోక్ భారత రాజకీయాలపై ప్రభావం చూపదని నేను భావిస్తున్నాను. కానీ నాకు అత్యంత ఇష్టమైన ఆటను ఓ రాజకీయ నాయకుడు ఆడటాన్ని మాత్రం చూడకుండా ఉండలేని. దాని కోసం వెయ్యి కళ్లతో ఎదుుర చూస్తుంటాను. " అని రెండోసారి పోస్టు చేశారు.
ఈ కామెంట్స్ వైరల్ కావడం అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కాస్పరోవ్ మరో పోస్ట్ పెట్టారు. భారత రాజకీయాలపై తను జోక్ చేశాను అన్నారు. రాజకీయ నాయకులను చమత్కరించడం తనకు ఎంతో ఇష్టమైన ఆట అన్నారు కాస్పరోవ్. అయితే అసలే ఎన్నికల వేళ కావడంతో రాహుల్ ప్రత్యర్థులు కాస్పరోవ్ వ్యాఖ్యల్ని వైరల్ చేస్తున్నారు.
రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్ 22 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు. చెస్‌లో ప్రపంచ విజేతగా నిలిచారు. 2005లో రిటైర్ అయిన ఆయన.. రష్యా అధినేత పుతిన్‌పైన కూడా ఇలా చాలా విమర్శలు చేసారు. కొన్నేళ్ల క్రితం రష్యా నుంచి పారిపోయి.. ప్రస్తుతానికి క్రొయేషియాలో తలదాచుకుంటున్నారు.