MI vs KKR Match Highlights: కోల్‌కతాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డగౌట్‌లో దిగాలుగా కూర్చుని తల పట్టుకున్న పాండ్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. చెప్పలేని బాధ అతనిలో ఉందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అతని స్పీచ్ వింటే అర్థమైపోతోంది. ఇప్పుడు ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నా ఎన్నో ప్రశ్నలు నా చుట్టూ ఉన్నాయి. వాటిలో చాలా సమాధానం చెప్పుకోవలసి కూడా ఉన్నాయి. బట్ సవాళ్లు నాకేం కొత్త కాదు. వాటిని అధిగమిస్తేనే అత్యుత్తమ ప్లేయర్ కాగలను అంటూ తనను తను సముదాయించుకునే సమాధానాలే చెప్పాడు హార్దిక్ పాండ్యా.
ముంబై ఓటమికి పాండ్యా ఓ కారణం
పాండ్యా హేట్ స్ప్రెడ్ చేయటం కాదు కానీ ఈ సీజన్‌లో ఘోర ఓటమి ప్రధానం కారణం ఎవరని చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే సమాధానం పాండ్యా అనే. దానికి రీజన్ ఈ సీజన్ ముందై డిసైడ్ అయ్యింది. ఉన్నఫళంగా కెప్టెన్ మార్పు. ఐదుసార్లు ముంబైని ఐపీఎల్ విజేతగా నిలిపిన యోధుడు రోహిత్ శర్మను అర్థాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది ముంబై యాజమాన్యం. దీనిపై విపరీతమైన ట్రోలింగ్. రోహిత్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ అయితే మండిపడిపోయారు.
విలన్‌గా మారిన పాండ్యా
కానీ క్రికెట్ ఎప్పుడూ కూడా టీమ్ స్పోర్ట్. ఇండివిడ్యువల్ ఫర్ ఫార్మెన్సెస్ ఎంత ఇంపార్టెంటో టీమ్‌ను ఒక తాటిపైన నడిపించే నాయకత్వం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ సీజన్‌లో చాలా సార్లు పాండ్యాకు ఓడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియలేదు. ఓడిపోవటానికి ఎవరూ ఇష్టపడరు ఓడిపోవాలని ఆడరు కూడా. కానీ పాండ్యా నుంచి ముంబైకి సహకారం లేదు. ముంబై నుంచి పాండ్యాకు సపోర్టూ లేదు. ఓ డిటాచ్డ్ మేనర్‌లో సాగిన ఈ సీజన్‌లో పాండ్యాకు విలన్‌గా మిగిలిపోవాల్సిన పరిస్థితి తప్పనిసరై కూర్చుంది.
మేనేజ్‌మెంట్ కూడా ఓటమికి కారణమే
ఈ సీజన్‌లో ప్రారంభంలో హార్డ్ కోర్ రోహిత్ శర్మ అండ్ హార్డ్ కోర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నినాదం ఒక్కటే. రోహిత్ ఆడాలి..ముంబై ఓడాలి. సొంత ఫ్యాన్సే తమ అభిమాన జట్టు ఓడిపోవాలి అని కోరుకునేంతలా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ జట్టును కెలికిపారేసింది. ఎక్కడో గుజరాత్‌కి ఆడుకునే పాండ్యానే తమకు కెప్టెన్‌గా కావాలని తీసుకురావటం. ఐదుసార్లు కప్పు కొట్టి తెచ్చి కాళ్ల దగ్గర పెట్టిన రోహిత్ శర్మను బాధ్యతల నుంచి తప్పించటం అన్నీ హిట్ మ్యాన్ వ్యతిరేక నిర్ణయాలే.
రోహిత్ రాణించినా
బట్ రోహిత్ శర్మ సీజన్ ప్రారంభంలో ఆ ప్రభావాన్ని ఎక్కడా తన బ్యాటింగ్ మీద పడకుండా చూసుకున్నాడు. వ్యక్తిగతంగా తనకు నష్టం జరుగుతున్నా కట్టప్పలా మాహిష్మతి బాగు కోసమే నిలబడ్డాడు. అది రోహిత్ స్టాట్స్‌ను చూస్తేనే అర్థమవుతోంది. మొదటి ఆరు మ్యాచుల్లో 261 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అది కూడా 167 స్ట్రైక్ రేట్, 52.2 యావరేజ్. టీ20ల్లో అద్భుతమైన గణాంకాలివి. కానీ ముంబై మ్యాచులు గెలవలేదు. ఆడిన ప్రతీ మ్యాచులోనూ ఓడిపోవటం..పాండ్యా లక్ష్యంగా విపరీతమైన ట్రోలింగ్స్.
రోహిత్ బ్యాటింగ్‌పై ఫ్యాన్స్ ఆందోళన
నిర్లక్ష్యపూరితమైన నిర్ణయాలతో ముంబై ఆటంతా పక్కకు వెళ్లి వివాదాలే మిగిలాయి. ఆ ప్రభావం రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద కనపడుతోంది. ఎందుకంటే తర్వాత ఐదు మ్యాచుల్లో రోహిత్ శర్మ కేవలం 65పరుగులే చేశాడు. 118 స్ట్రైక్ రేట్..యావరేజ్ మ్యాచ్‌కు 13 పరుగులు. టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఇది ఆందోళన కలిగించే అంశం. రోహిత్ శర్మ సడెన్‌గా ఫామ్‌ను కోల్పోయినా తిరిగి వరల్డ్ కప్ నాటికి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మనే టీమిండియాకు చాలా కీలకం. మరో ఎండ్‌లో యశస్వి జైశ్వాల్ ఉండే అవకాశమే దాదాపుగా ఉంటుంది. కాబట్టి హిట్ మ్యాన్ ఆడితేనే ఆ కుర్రాడు కాన్ఫిడెంట్‌గా ఆడగలుగుతాడు. లేదంటే రోహిత్ ఇప్పుడున్న ఫామ్...ముంబై చేసిన గందరగోళం..టీమిండియా బ్యాటింగ్ లయను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
కేకేఆర్ మీద ఓటమితో ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి. ఇక మిగిలిన 3 మ్యాచుల్లోనైనా గెలిస్తే కాస్త గౌరవప్రదంగా సీజన్‌ను ముగించొచ్చు. లేదంటే ఈ ఓటమి ప్రభావం అటు రోహిత్ ఇటు పాండ్యాపైన పడితే అది టీ20 వరల్డ్ కప్పులో టీమిండియాకే నష్టం.