RCB vs GT IPL 2024 Preview and Prediction : సాంకేతికంగా ఇంకా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)... గుజరాత్ టైటాన్స్(GT) మరో పోరుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచుల్లో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా... గుజరాత్ టైటాన్స్ పది మ్యాచుల్లో ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. మిణుకు మిణుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలు ఇంకా మిగిలి ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు విజయం తప్పనిసరి. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వరుస పరాజయాలతో పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఉండడం... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్లే ఆఫ్ ఆశలను మళ్లీ రేపింది.
ఆత్మ విశ్వాసంతో బెంగళూరు
ఐపీఎల్ లీగ్ దశలో పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు.. చివరి రెండు మ్యాచ్‌లలో విజయాలు నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. విల్ జాక్స్ గత మ్యాచ్‌లో గుజరాత్‌పైనే అద్భుత శతకం చేశాడు. హైదరాబాద్‌పై కామెరాన్ గ్రీన్ చివరి వరకు క్రీజులో నిలిచి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సొంత మైదానం చిదంబరం స్టేడియంలో ఆడనుండడం బెంగళూరుకు కలిసి రానుంది.విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో 500 పరుగుల మార్కును దాటిన మొదటి బ్యాటర్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లోనూ విరాట్ చెలరేగాలని బెంగళూరు కోరుకుంటోంది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ల నిలకడ లేమీ ఆ జట్టును వేధిస్తోంది. టీ 20ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించికున్న మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌ను చాటుకోవల్సి ఉంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యష్ దయాల్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ మెరుగ్గా రాణించారు.
గుజరాత్‌ను వేధిస్తున్న సమస్యలు
చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. గుజరాత్ అన్ని విభాగాల్లో సమష్టిగా విఫలమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకుంది. శుభమన్ గిల్, భరద్వాజ్ సాయి సుదర్శన్ మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి 700కు పైగా పరుగులు చేశారు. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, షారుక్ ఖాన్ రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ గుజరాత్ 200 పరుగులు చేయకపోవడం వారి బ్యాటింగ్ బలహీనతలను బహిర్గతం చేస్తోంది. రషీద్ ఖాన్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ స్టార్ స్పిన్నర్ 10 మ్యాచ్‌లలో కేవలం ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. మహ్మద్ షమీ లేకపోవడం టైటాన్స్ బౌలింగ్‌ను బలహీనపర్చింది. అత్యంత అనుభవజ్ఞులైన ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ అంచనాలను అందుకోలేకపోతున్నారు.
జట్లు
బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ , రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
గుజరాత్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, B. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్, BR శరత్.