ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచులు వారిని ఉల్లాసపరుస్తున్నాయి. చిన్న జట్ల సంచలన విజయాలతో ఆయా దేశ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మైదానాల్లో ఆల్కహాల్ వినియోగంపై నిషేధం ఉంది. ఈ విషయంపై చాలామంది అసంతృప్తి వ్యక్తంచేశారు. అలానే కొంతమంది దొంగచాటుగా మద్యం తీసుకొస్తూ సెక్యూరిటీకి దొరికిపోతున్నారు.  తాజాగా ఓ అభిమాని ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు బైనాక్యులర్‌లో మద్యం తీసుకొచ్చాడు. చివరికి సెక్యూరిటీకి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


బైనాక్యులర్ లో మద్యం


ఓ మెక్సికో అభిమాని బైనాక్యులర్‌ మధ్య భాగంలో చిన్న డబ్బా ఏర్పాటు చేసి అందులో మద్యం తీసుకొచ్చాడు. అయితే భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి పరిశీలించారు. దాని లెన్స్‌ తొలగించి చూడగా  అసలు విషయం బయటపడింది. ఇదేంటని అడిగితే హ్యాండ్‌ శానిటైజర్‌ అని ఆ అభిమాని చెప్పడం చర్చనీయాంశం అయ్యింది.


ఫిఫా ఆదేశాలు


ఇస్లామిక్‌ దేశాల్లో ఆల్కహాల్‌పై ఎక్కువగా నిషేధం ఉంటుంది. ఖతార్‌లో ప్రపంచకప్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందే.. స్టేడియం పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై బ్యాన్‌ విధించారు. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మ్యాచ్‌లు జరిగే 8 మైదానాల పరిసరాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అభిమానులకు బీర్లు విక్రయించకూడదని ఫిఫా ఆదేశాలు ఇచ్చింది.


ఫిఫా ప్రపంచకప్ లో నేడు ఆతిథ్య ఖతార్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దోహాలోని అల్ తుంబనా మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఖతార్- సెనెగల్ మధ్య ఇది మొదటి మ్యాచ్. అలాగే  ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో సెనెగల్ తొలిసారిగా ఆతిథ్య దేశంతో తలపడుతోంది. గత 2 వరల్డ్ కప్ లలో ఆతిథ్య దేశంతో తలపడిన సెనెగెల్ రెండింటిలోనూ ఓడిపోయింది.


ఈ మ్యాచ్ ఖతార్ కు చాలా ముఖ్యమైనది. తన మొదటి మ్యాచులో 2-0 తేడాతో ఈక్వెడార్ చేతిలో ఖతార్ ఓడిపోయింది. ఫిఫా ప్రపంచకప్ లో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచులో ఓడిపోవడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ మ్యాచులో గెలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది.