Watch Video: క్రిస్టియానో రొనాల్డో.... ఫుట్ బాల్ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఫుట్ బాల్ గురించి అంతగా తెలియని వాళ్లకు సైతం తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫుట్ బాలర్లలో రొనాల్డో ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ లో ఎన్నో రికార్డులు, ఘనతలు అందుకున్న రొనాల్డోకు ప్రపంచకప్ అందుకోవడం మాత్రం కలగానే ఉండిపోయింది. ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న క్రిస్టియానో కెరీర్ లో వరల్డ్ కప్ సాధించకపోవడం ఓ లోటుగానే మిగిలిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ను అయినా అందుకుంటాడని అభిమానులు ఆశించిన వేళ... మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవటంతో ఆశలు అడియాసలు అయ్యాయి. 


మైదానంలో భావోద్వేగం


కెరీర్ లో కనీసం ఒక్క ప్రపంచకప్ అయినా సాధించాలన్న సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కల చెదిరింది. మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో 1-0తో ఓటమితో పోర్చుగల్ ఇంటిబాట పట్టింది. 37 ఏళ్ల రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ అంటూ వార్తలు వస్తున్న వేళ... ఇక అతని ప్రపంచకప్ కల కలగానే మిగిలిపోనుంది. అది తలచుకునే కాబోలు అంతటి ఆటగాడు ఓటమి అనంతరం మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమయ్యాడు.  చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రొనాల్డో కన్నీళ్లను తుడుచుకొంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పోర్చుగల్‌  తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్‌ చేశాడు.


కోచే కారణమా!


రొనాల్డో ప్రపంచకప్ కల చెదిరిపోవడానికి ఒక రకంగా ఆ జట్టు కోచ్ కారణమని అభిమానులు విమర్శిస్తున్నారు. పొర్చుగల్‌ నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌ల్లో రొనాల్డో జట్టు మేనేజర్‌ ఫెర్నాండో శాంటోస్‌ బెంచ్‌కే పరిమితం చేశాడు. అతన్ని సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగానే మైదానంలోకి దింపడం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్‌ 50 నిమిషాలు గడిచిన తర్వాత మైదానంలోకి దిగిన రొనాల్డో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే తన నిర్ణయాన్ని శాంటోస్‌ సమర్థించుకొన్నాడు. ‘‘నేనేం బాధపడటంలేదు. అలాగే దేన్నీనేను మార్చలేను. స్విట్జర్లాండ్‌పై అద్భుతంగా ఆడిన జట్టునే బరిలోకి దింపాను. రొనాల్డో విషయంలో తీసుకొన్న కఠిన నిర్ణయం వ్యూహాత్మకమైంది. జట్టు విషయంలో మనసుతోకాదు.. మెదడుతో ఆలోచించాలి. అలాగని రొనాల్డో గొప్ప ఆటగాడు కాకుండా పోడు. కొన్ని సందర్భాల్లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో అదృష్టం కూడా కలిసి రావాలి’’ అని శాంటో అన్నాడు. ఏదేమైనా రొనాల్డోను బెంచ్ కే పరిమితం చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.


ప్రస్తుతం 37 ఏళ్ల వయసున్న రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడడం అసాధ్యమనే అనిపిస్తోంది. అలా అయితే అతని ప్రపంచకప్ కల తీరకుండానే కెరీర్ కు వీడ్కోలు పలికినట్లే.