France vs England FIFA WC:  ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ సత్తా చాటింది. క్వార్టర్స్‌ పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 2-1 తేడాతో బ్రిటీష్‌ జట్టును ఓడించింది. ఈ విజయంతో సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 


ఈ పోరులో ఇంగ్లాండ్‌ జట్టే ఎక్కువ శాతం బంతిని తన నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ..  అందివచ్చిన అవకాశాలను ఆ జట్టు ఉపయోంచుకోలేకపోయింది. మరోవైపు ఫ్రాన్స్‌ ఆటగాళ్లు గోల్‌పోస్టు వైపు పదేపదే దూసుకొచ్చినా ఎక్కువ గోల్స్‌ చేయలేకపోయారు. తొలి అర్ధభాగంలో 17 నిమిషాల వద్ద ఫ్రాన్స్‌ ఆటగాడు అరెలియన్‌ చౌమెనీ అద్భుతంగా గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌ శిబిరంలో సంతోషం నింపాడు. దీంతో ఫ్రాన్స్‌ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఆ తర్వాత ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ తొలి అర్ధభాగంలో మరో గోల్‌ కొట్టలేకపోయాయి.






రెండో అర్ధభాగంలో 54 నిమిషాల వద్ద ఇంగ్లండ్ ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 78 నిమిషాల వద్ద ఒలివర్‌ గిరౌడ్‌ అద్భుత రీతిలో గోల్‌చేసి ఫ్రాన్స్‌ను 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. ఈ క్రమంలో 84 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. అయితే తొలి పెనాల్టీని గోల్‌గా మలిచిన హారీ కేన్‌ రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. బంతి గోల్‌పోస్ట్‌ పైనుంచి వెళ్లటంతో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మ్యాచ్ ఆఖరి వరకు ఇంగ్లండ్ మరో గోల్ చేయలేకపోయింది. దీంతో ఫ్రాన్స్ విజయం సాధించింది.


సెమీఫైనల్లో ఫ్రాన్స్, మొరాకోను ఢీకొంటుంది. శనివారం జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ కు షాకిచ్చిన మొరాకో సెమీఫైనల్ పోరుకు అర్హత సాధించింది.


పోర్చుగల్‌పై విజయంతో సెమీస్‌ చేరిన మొరాకో


ఫిఫా వరల్డ్ కప్ 2022లో మొరాకో జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి ఆఫ్రికన్ జట్టుగా మొరాకో నిలిచింది. దోహాలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 గోల్స్  తేడాతో పోర్చుగల్ పై మొరాకో గెలిచి, సగర్వంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్న మూడు ఆఫ్రికన్ జట్లుగా 1990లో కామెరూన్, 2002లో సెనెగల్, 2010లో ఘనా నిలిచాయి. తాజా విజయంతో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా మొరాకో నిలిచి వరల్డ్ కప్ రేసులో మరో అడుగు ముందుకేసింది.