FIFA World Cup 2022:   ఫిఫా ప్రపంచకప్ లో జర్మనీ నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం స్పెయిన్ తో జరిగిన మ్యాచును జర్మనీ డ్రా చేసుకుంది. ఒక దశలో 0-1 తో వెనుకబడ్డ జర్మనీ ఓడిపోయేలా కనిపించింది. అయితే చివరి నిమిషాల్లో నిక్లాస్ ఫుల్ క్రుగ్ గోల్ చేయటంతో జర్మనీ ఊపరి పీల్చుకుంది.


స్పెయిన్ దే ఆధిపత్యం 


మ్యాచ్ ప్రారంభంలో స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. ఎక్కువశాతం బంతిని తన నియంత్రణలో ఉంచుకుంది. మంచి అవకాశాలు లభించినా ఆ జట్టు ఆటగాళ్లు వాటిని గోల్స్ గా మరల్చడంలో విఫలమయ్యారు. మొదటి అర్ధభాగంలో రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. రెండో అర్ధభాగంలో 62వ నిమిషంలో అల్వారో మొరాటా గోల్ చేసి స్పెయిన్ కు ఆధిక్యం అందించాడు. తర్వాత జర్మనీ ఆటగాళ్లు చురుగ్గా కదిలారు. స్పెయిన్ గోల్ పోస్టు పైకి దాడులు చేశారు. ఆఖరికి నిక్లాస్ ఫుల్ క్రుగ్ 83వ నిమిషంలో గోల్ కొట్టటంతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచు ముగిసే వరకు రెండు జట్లు మరో గోల్ కొట్టలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 


ఈ మ్యాచ్‌లో 56% సమయం బంతి స్పెయిన్‌ వద్దనే ఉంది. జర్మనీ బాల్ పొసెషన్ 33%. అయితే గోల్ ప్రయత్నాల పరంగా జర్మనీ (10) స్పెయిన్ (7) కంటే కాస్త ముందంజలో ఉంది. స్పెయిన్ 565 పాస్‌లను పూర్తిచేయగా.. జర్మనీ 281 పాస్‌లను ఇచ్చింది. కార్నర్లు, ఫ్రీ కిక్‌ల పరంగా ఇరు జట్లు దాదాపు సమానంగా నిలిచాయి. స్పెయిన్‌కు 6 కార్నర్‌లు, 16 ఫ్రీ కిక్‌లు లభించగా... జర్మనీకి 5 కార్నర్‌లు, 15 ఫ్రీ కిక్‌లు లభించాయి.


జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జర్మనీ 1-2 తేడాతో ఓడిపోయింది. ఒకవేళ స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింటే నాకౌట్ దారులు మూసుకుపోయేవి. మరోవైపు గత మ్యాచ్‌లో స్పెయిన్ 7-0తో కోస్టారికాపై విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుతో మ్యాచ్ డ్రా చేసుకోవడం జర్మనీకి పాజిటివ్ గా మారింది. 


గ్రూప్-ఇలో ఆసక్తికరమైన పోరు


గ్రూప్-ఇలో స్పెయిన్ జట్టు 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. జపాన్, కోస్టారికా ఖాతాల్లో సమానంగా 3 పాయింట్లు ఉన్నాయి. జర్మనీ చివరి స్థానంలో ఉంది. ప్రతి గ్రూపు నుంచి టాప్ 2 లో ఉన్న జట్లు రౌండ్ 16కు అర్హత సాధిస్తాయి. తమ చివరి మ్యాచుల్లో స్పెయిన్ జపాన్ తో ... జర్మనీ కోస్టారికాతో తలపడనున్నాయి.